T20 World Cup 2021: ఆసీస్ విజయంలో కీలకంగా వ్యవహరించిన మిచెల్ మార్ష్.. ఇప్పుడు ఆ జట్టు హీరో. అయితే మిచెల్ మార్ష్ ఒక్కడే కాదు.. వాళ్ల ఫ్యామిలీ మొత్తం ఆస్ట్రేలియా కోసం గత 34 ఏండ్లుగా సేవలందిస్తూనే ఉన్నది.
పొట్టి ప్రపంచకప్ కు ముందు వరుసగా ఐదు టీ20 సిరీస్ లలో పరాజయం. జట్టు నిండా ఆల్ రౌండర్లున్నా.. అయిదు సార్లు వన్డే ప్రపంచకప్ అన్న విజేత ట్యాగ్ ఉన్నా.. దాదాపు మూడు దశాబ్దాల పాటు ప్రపంచ క్రికెట్ ను ఏకఛత్రాధిపత్యంగా ఏలినా.. పొట్టి ప్రపంచకప్ రాలేదన్న బాధ ప్రతి ఒక్క ఆస్ట్రేలియన్ లో ఉంది. ఇక 2021 T20 World Cupకు ముందు కూడా ఆ జట్టు మీద పెద్దగా ఆశల్లేవు. సెమీస్ చేరితో అదే మహాభాగ్యం అనుకున్నారంతా. అనుకున్నట్టుగానే సూపర్-12 తొలి దశలో కంగారూలది అదే ఆటతీరు. కానీ రెండో దశలో అద్భుతంగా పుంజుకున్న ఆ జట్టు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీ20 ప్రపంచకప్ ను సగర్వంగా ఎత్తుకుంది.
నిన్న రాత్రి New Zealandతో జరిగిన ఫైనల్లో Australia విజయంలో కీలకంగా వ్యవహరించిన మిచెల్ మార్ష్.. ఇప్పుడు ఆ జట్టు హీరో. అయితే Mitchell Marsh ఒక్కడే కాదు.. వాళ్ల ఫ్యామిలీ మొత్తం ఆస్ట్రేలియా కోసం గత 34 ఏండ్లుగా సేవలందిస్తూనే ఉన్నది. మార్ష్ అన్న.. తండ్రి కూడా ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిథ్యం వహించిన వాళ్లే..
తండ్రి కూడా హీరోనే..
సరిగ్గా 34 ఏండ్ల క్రితం.. భారత్-పాకిస్థాన్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరిగింది. ఈ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు నాకౌట్ దశలోనే నిష్క్రమించాయి. కానీ ఆసీస్-ఇంగ్లాండ్ ఫైనల్ కు చేరాయి. నవంబర్ 8న జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 253 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్.. 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఫైనల్లో ఆసీస్ తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగిన జెఫ్ మార్ష్.. 24 పరుగులే చేశాడు. కానీ టోర్నీ మొత్తంలో Geoff Marsh.. 428 పరుగులతో సత్తా చాటాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. జెఫ్ మార్ష్ అద్భుత బ్యాటింగ్ తో ప్రపంచకప్ చరిత్రలో ఆసీస్ తొలిసారి విశ్వ విజేత గా నిలిచింది.
కోచ్ గా కూడా సక్సెస్..
కాగా.. ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన మార్ష్.. ఆ తర్వాత హెడ్ కోచ్ గా కూడా మారాడు. 1999లో స్టీవ్ వా నేతృత్వంలోని కంగారూ సేన మరోసారి ప్రపంచకప్ నెగ్గింది. ఆ జట్టుకు మార్ష్ కోచ్ కావడం గమనార్హం.
ఇప్పుడు కొడుకు..
వన్డేలలో 5 ప్రపంచకప్ లు ఉన్నా.. టెస్టు క్రికెట్ ను ఏలినా కొద్దికాలంగా ఆసీస్ ప్రభ మసకబారింది. సీనియర్లంతా ఒక్కక్కరు రిటైర్ అవడం. కొత్తగా జట్టులోకి వచ్చిన వాళ్లలో పెద్దగా నిలకడ లేక అలా వచ్చి ఇలా వెళ్లడం తో కొద్దికాలంగా ఆ జట్టు ఆశించిన మేర రాణించడం లేదు. ఈ ప్రపంచకప్ లో కూడా ఆసీస్ టైటిల్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఫైనల్లో భారీ లక్ష్య ఛేదనలో ఆదిలోనే ఆసీస్ కు భారీ దెబ్బ. పరుగులేమీ చేయకుండానే ఆరోన్ ఫించ్ ఔట్. అవతలి ఎండ్ లో ట్రెంట్ బౌల్ట్ నిప్పులు చెరుగుతున్నాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతున్నది. ఇన్ని అడ్డంకుల మధ్య బ్యాటింగ్ కు దిగిన మిచెల్ మార్ష్.. రావడం రావడమే దాడికి దిగాడు. సిక్సర్ తో ప్రారంభించిన అతడు.. ఆ తర్వాత వరుసగా రెండు ఫోర్లు బాదాడు. మొత్తంగా 50 బంతుల్లోనే 77 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఫైనల్ తో పాటు ఈ టోర్నీలో మార్ష్ మొత్తంగా 185 పరుగులు చేయడం గమనార్హం. జాతీయ జట్టులోకి రాకముందు మార్ష్.. ఆసీస్ కు 2011 లో అండర్-19 ప్రపంచకప్ కూడా అందించాడు.
అన్న కూడా తోపే..
మిచెల్ మార్ష్ తండ్రి జెఫ్ మార్షే కాదు.. అన్న కూడా ఆసీస్ తరఫున ఆడుతున్నవాడే. ఆసీస్ క్రికెటర్ Shaun Marsh.. ధనాధన్ క్రికెట్ లో వీరబాదుడు బాదడంలో దిట్ట. ఐపీఎల్ తొలి సీజన్ లో అత్యధిక పరుగులు చేసింది షాన్ మార్షే. ఆ సీజన్ లో అతడే ఆరెంజ్ క్యాప్ హోల్డర్. ఆ తర్వాత ఆసీస్ జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. ఇలా కుటుంబమంతా ఆసీస్ క్రికెట్ కోసమే సేవలందిస్తుండటం గమనార్హం.
