సారాంశం

షెడ్యూల్ ప్రకారం వెస్టిండీస్‌తో పాటు యూఎస్‌ఏలో 2024 టీ20 వరల్డ్ కప్ టోర్నీ... ఏడాదిలో పొట్టి ప్రపంచకప్ నిర్వహణకి కావాల్సిన ఏర్పాట్లు చేయలేమని చేతులు ఎత్తేసిన అమెరికా... ఇంగ్లాండ్‌కి 2024 టీ20 వరల్డ్ కప్ మారే అవకాశం.. 

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. అయితే వచ్చే ఏడాది వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల్లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీపైన మాత్రం ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. షెడ్యూల్ ప్రకారం 2024 టీ20 వరల్డ్ కప్ టోర్నీకి వెస్టిండీస్‌తో పాటు యూఎస్‌ఏ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది..

యునైటెడ్ స్టేట్స్‌లో ఓ మెగా క్రికెట్ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. అయితే ఈ టోర్నీకి ఇంకా 12 నెలల సమయం మాత్రమే ఉండడంతో టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీని నిర్వహించేందుకు అమెరికా సిద్ధంగా లేదని సమాచారం. అమెరికాలో క్రికెట్‌కి ఆదరణ చాలా తక్కువ.

టీ20 వరల్డ్ కప్ నిర్వహించాలంటే క్రికెట్ స్టేడియాలు కావాలి, లక్షల మంది క్రికెట్ ఫ్యాన్స్ కోసం వసతి, సదుపాయల కల్పన వంటి ఏర్పాట్లు చేయాలి. అయితే ఇంత తక్కువ సమయంలో అవన్నీ చేయడం అసాధ్యమని భావిస్తున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా... ఆతిథ్య హక్కుల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం..

దీంతో ఇంగ్లాండ్ వేదికగా 2024 టీ20 వరల్డ్ కప్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సమయంలో టీ20 వరల్డ్ కప్‌ని వెస్టిండీస్, అమెరికాల నుంచి తరలించడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికే 2030 టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ సంయుక్తంగా వేదిక ఇవ్వబోతున్నాయి. 

దీంతో ఒకవేళ 2024 టీ20 వరల్డ్ కప్, ఇంగ్లాండ్‌కి మారితే 2030 టీ20 వరల్డ్ కప్‌ టోర్నీ వెస్టిండీస్, యూఎస్‌ఏలకి మారే అవకాశం ఉంది.  2021 నవంబర్‌లోనే 2030 వరకూ జరగబోయే ఐసీసీ ఈవెంట్స్, వాటికి ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశాలను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)..

2021 టీ20 వరల్డ్ కప్‌ టోర్నీకి ఇండియా ఆతిథ్యం ఇవ్వాల్సింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ టోర్నీని తటస్థ వేదిక యూఏఈ, ఓమన్‌లలో నిర్వహించింది బీసీసీఐ. 2022 టీ20 వరల్డ్ కప్‌కి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వగా 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి భారత్ వేదిక ఇవ్వనుంది..

2024 టీ20 వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించిన ఆతిథ్య హక్కులను వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దక్కించుకోగా 2025లో పాకిస్తాన్‌లో మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. 1996 తర్వాత పాకిస్తాన్‌లో ఏ రకమైన ఐసీసీ టోర్నీ జరగలేదు. దీంతో 29 ఏళ్ల తర్వాత పాక్‌లో ఐసీసీ టోర్నీ జరుగుతుందని పాక్ క్రికెట్ బోర్డు సంతోషపడుతోంది.

అయితే ఆసియా కప్ 2023 టోర్నీ కోసం పాకిస్తాన్‌కి వెళ్లేందుకు భారత క్రికెట్ జట్టు నిరాకరించింది. దీంతో ఆసియా కప్ ఎక్కడ పెడతారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ పాక్ నుంచి ఆసియా కప్ 2023 టోర్నీ తరలించబడితే, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా తటస్థ వేదికపై నిర్వహించాల్సి రావచ్చు..

2026లో ఇండియా, శ్రీలంక కలిసి సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్‌కి ఆతిథ్యం ఇస్తాయి. ఆ తర్వాత 2027లో నమీబియా, జింబాబ్వే, సౌతాఫ్రికా కలిసి సంయుక్తంగా వన్డే వరల్డ్ కప్‌కి ఆతిథ్యం ఇస్తాయి...

2028లో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్, 2029లో న్యూజిలాండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతాయని ఐసీసీ తెలిసింది. 2030లో ఇంగ్లాండ్ అండ్ వేల్స్‌లో టీ20 వరల్డ్ కప్, 2031లో ఇండియా, బంగ్లాదేశ్‌లో వన్డే వరల్డ్ కప్‌ జరగబోతున్నట్టు ఐసీసీ ప్రకటించింది..