పురుషుల టీ-20 ప్రపంచకప్ పోటీలను వాయిదా వేస్తున్నట్టుగా సోమవారం నాడు ఐసీసీ ప్రకటించింది.2021 అక్టోబర్ మాసంలో పురుషుల టీ-20 ప్రపంచకప్ పోటీలను నిర్వహించాలని ఐసీసీ ఇవాళ నిర్ణయం తీసుకొంది. వచ్చే ఏడాది నవంబర్ 14వ తేదీన టీ 20 ఫైనల్ మ్యాచ్ ను నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకొంది. 


షెడ్యూల్ ప్రకారంగా ఈ ఏడాది అక్టోబర్ 18వ తేదీ నుండి నవంబర్ 15 వరకు ఈ పోటీలు నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకొంది. కరోనా నేపథ్యంలో ఈ పోటీలను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది ఐసీసీ.  ఐసీసీ గవర్నింగ్ బాడీ వీడియో కాన్పరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఈ ఏడాది అస్ట్రేలియాలో ఈ పోటీలు జరగాల్సి ఉంది. 

అంతేకాదు 2022లో టీ 20 పురుషుల ప్రపంచకప్ పోటీలు అక్టోబర్ నవంబర్ మాసాల్లో నిర్వహించనున్నారు. ఫైనల్ మ్యాచ్ ను అదే ఏడాది నవంబర్ 13వ తేదీన నిర్వహించనున్నారు. 

50 ఓవర్ల ప్రపంచకప్ క్రికెట్ పోటీలు 2023లో ఇండియాలో నిర్వహించనున్నారు. ఈ పోటీలు కూడ అక్టోబర్ నవంబర్ మాసాల్లో నిర్వహించనున్ననారు. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 26వ తేదీన నిర్వహించనున్నట్టుగా ఐసీసీ ప్రకటించింది.

2020, 2021 టీ 20 ప్రపంచకప్ పోటీలు ఎక్కడ నిర్వహిస్తారో మాత్రం ఐసీసీ ప్రకటించలేదు. 2021 టీ20 ప్రపంచ కప్ పోటీలు మాత్రం వాస్తవానికి ఇండియాలో నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.  కానీ, తాజాగా తీసుకొన్న నిర్ణయం మేరకు 2021లో నిర్వహించే  పోటీలను ఎక్కడ నిర్వహిస్తారో స్పష్టత ఇవ్వలేదు.