Big Shock To Ramiz Raja: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజాకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న నాలుగు దేశాల టీ20 సిరీస్ ఆశలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నీళ్లు చల్లింది.
సభ్య దేశాలు వద్దన్నా వినకుండా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా వ్యవహరించిన పీసీబీ చైర్మన్ రమీజ్ రాజాకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఆయన ప్రతిపాదించిన నాలుగు దేశాల టీ20 సూపర్ సిరీస్ టోర్నీకి ఐసీసీ ఆదిలోనే మెకాలడ్డింది. ఈ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలతో కలిపి ప్రతి యేటా సెప్టెంబర్-అక్టోబర్ లో టీ20 సిరీస్ నిర్వహించాలని, తద్వారా వచ్చే ఆదాయాన్ని నాలుగు దేశాలు పంచుకోవాలనే ప్రతిపాదనతో రమీజ్ రాజా ఈ ఏడాది జనవరిలో ఓ ప్రతిపాదనను తీసుకొచ్చారు.
గత మూడు రోజులుగా దుబాయ్ లో సమావేశమైన ఐసీసీ పాలకమండలి రమీజ్ ప్రతిపాదనపై చర్చించింది. అయితే పీసీబీ ప్రతిపాదన ఐసీసీ ఈవెంట్స్ (మూడు దేశాల సిరీస్) కు విరుద్ధంగా ఉందని చెప్పినట్టు సమాచారం.
ఈ విషయాలపై చర్చించే ఐసీసీ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ రమీజ్ రాజా ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ వేయలేదు. సభ్య దేశాలు ముక్కోణపు టోర్నమెంట్ కంటే ఎక్కువ ఆతిథ్యం ఇవ్వడానికి అనుమతించదని పేర్కొంటూ ప్రతిపాదనను తిరస్కరించినట్టు బోర్డు సభ్యుడు ఒకరు వెల్లడించారు. ఈ ప్రతిపాదన ఐసీసీ మార్క్యూ ఈవెంట్ల విలువను తగ్గిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో పాటు రమీజ్ రాజా ప్రతిపాదనలో ప్రధానమైన విషయం భారత్-పాకిస్తాన్. ఈ రెండు దేశాలు 2013 తర్వాత ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. సరిహద్దు వివాదాలు, రాజకీయ ఘర్షణల వంటి కారణాలతో రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలను ఒప్పించడం కత్తిమీద సాము అని ఐసీసీకి కూడా తెలుసు. దీంతో పీసీబీ ప్రతిపాదనకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది.
పీసీబీ అధ్యక్ష పదవి గోవిందా..?
నాలుగు దేశాల టోర్నీకి ఐసీసీ గ్రీన్ లైట్ వేయకపోవడంతో కోలుకోలేని స్థితిలో ఉన్న రమీజ్ రాజాకు మరో భారీ షాక్ తగిలనుంది. ఆయన పీసీబీ చైర్మన్ పదవి నుంచి కూడా తప్పుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నమ్మకస్తుడిగా ఉన్న రమీజ్ రాజా.. ఆయన అండదండలతోనే పీసీబీ అధ్యక్షుడయ్యాడు. అయితే ఇటీవల దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఇమ్రాన్ ఖాన్ ప్రధాని బాధ్యతల నుంచి వైదొలగాల్సి వచ్చింది. దీంతో రమీజ్ రాజా కూడా పీసీబీ అధ్యక్ష పదవిలో ఉండేది అనుమానమే..? అని వార్తలు వెలువడుతున్నాయి.
రమీజ్ రాజా అధ్యక్షుడయ్యాక ఏకపక్ష నిర్ణయాలతో ఇప్పటికే భ్రష్టు పట్టిపోయి ఉన్న పాక్ క్రికెట్ ను మరింత దిగజార్చాడని ఆరోపణలు వచ్చాయి. అతడు పీసీబీ చైర్మన్ అయ్యాక అప్పటి పాక్ కు హెడ్ కోచ్ గా ఉన్న మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ లు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల పాకిస్తాన్ లో పర్యటించిన ఆస్ట్రేలియా.. మూడు టెస్టులు ఆడింది. అయితే తొలి రెండు టెస్టులు రావల్పిండి, కరాచీలలో ఫలితం తేలలేదు.
ఆసీస్ కు భయపడి పూర్తిగా నిర్జీవమైన పిచ్ లు తయారుచేశారని కూడా పీసీబీ పై తీవ్రమైన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా.. రమీజ్ రాజా పదవి సంగతి కొత్తగా వచ్చే ప్రధాని పై ఆధారపడి ఉంది. ఆయన కొనసాగమంటే రమీజ్ కొనసాగుతాడు. లేకుంటే మళ్లీ మైక్ పట్టడమే.. గతంలో రమీజ్ రాజా కామెంటేటర్ గా పని చేసిన విషయం విదితమే.
