ICC Cricket World Cup 2023: ప్రస్తుత ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో భారత బౌలింగ్ అటాక్ కు నాయకత్వం వహించిన భారత పేసర్ మహ్మద్ షమీ టోర్నమెంట్ లో కేవలం ఆరు మ్యాచ్ ల్లోనే 23 వికెట్లు పడగొట్టాడు. మెగా టోర్నీలో  ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. 

Mohammed Shami: ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ 2023 లో భార‌త జ‌ట్టు త‌న అద్భుత‌మైన జైత్ర‌యాత్ర‌లో బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ కీల‌క పాత్ర పోషించాడు. ఈ క్ర‌మంలోనే ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా యంత్రాంగం ష‌మీ స్వ‌గ్రామంలో మినీ-స్టేడియం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనను పంపాలనీ, వ్యాయామశాలను ప్రారంభించాలని నిర్ణయించింది.

ఐసీసీ వ‌న్డే ప్రపంచ కప్ 2023లో షమీ అద్భుత ప్రదర్శన తర్వాత అమ్రోహా జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. దీని గురించి అమ్రోహా జిల్లా మేజిస్ట్రేట్ రాజేష్ త్యాగి (IAS) మాట్లాడుతూ "మహ్మద్ షమీ గ్రామంలో మినీ స్టేడియం నిర్మించాలని మేము ఒక ప్రతిపాదనను పంపుతున్నాము, ఆ ప్రతిపాదనలో, ఓపెన్ జిమ్నాసియం కూడా ఉంటుంది. అక్కడ తగినంత భూమి కూడా ఉంద‌ని" తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 20 స్టేడియంలను నిర్మించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనీ, జిల్లా అమ్రోహా స్టేడియంను కూడా దీనికి ఎంపిక చేశామని ఆయన అన్నారు.

మినీ స్టేడియం, వ్యాయామశాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించేందుకు శుక్రవారం డీఎం త్యాగి నేతృత్వంలోని బృందం షామి గ్రామాన్ని సందర్శించింది. మహమ్మద్ షమీ ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఉన్న సహస్‌పూర్ అలీనగర్ గ్రామానికి చెందినవాడు. కాగా, భారత పేసర్ మహమ్మద్ షమీ ప్రస్తుత క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత బౌలింగ్ దాడికి నాయకత్వం వహించాడు. టోర్నమెంట్‌లో కేవలం ఆరు మ్యాచ్ ల‌లోనే 23 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో టాప్ లో ఉన్నాడు.