Asianet News TeluguAsianet News Telugu

న్యూయార్క్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్... టీ20 వరల్డ్ కప్ 2024 వేదికలు ఖరారు చేసిన ఐసీసీ..

వచ్చే ఏడాది జూన్‌ 4 నుంచి జూన్ 30 వరకూ టీ20 వరల్డ్ కప్ 2024...  యూఎస్‌ఏలోని డల్లాస్, మియామీ,న్యూయార్క్ నగరాల్లో ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్...

ICC confirms T20 World cup 2024 Venues, Dallas, Florida, New York, India vs Pakistan CRA
Author
First Published Sep 21, 2023, 12:57 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగిసిన 8 నెలలకే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ జరగనుంది. వచ్చే ఏడాది జూన్‌ 4 నుంచి జూన్ 30 వరకూ జరిగే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో మొట్టమొదటిసారి ఏకంగా 20 జట్లు పాల్గొనబోతున్నాయి. 55 మ్యాచులుగా జరిగే ఈ పొట్టి ప్రపంచ కప్‌కి వెస్టిండీస్‌తో కలిసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుంది..

యూఎస్‌ఏలో టీ20 వరల్డ్ కప్ పోటీలు జరగడం ఇదే తొలిసారి. వివిధ కారణాలతో ఈ టోర్నీ, యూఎస్‌ఏ నుంచి ఇంగ్లాండ్‌కి మారవచ్చని ప్రచారం జరిగినా యునైటెడ్ స్టేట్స్, క్రికెట్ ప్రపంచ కప్‌‌కి వేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. యూఎస్‌ఏలోని డల్లాస్, మియామీ,న్యూయార్క్ నగరాల్లో ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 మ్యాచులు జరుగుతాయని ఐసీసీ ఖరారు చేసింది..

డల్లాస్‌లో గ్రాండ్ ప్రేరీ, ఫ్లోరిడాలోని బ్రోవర్డ్ కౌంటీ, న్యూయార్క్‌లోని నసౌ కౌంటీలు ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. న్యూయార్క్‌లోని నసౌ కౌంటీలో దాదాపు 34 వేల మంది అభిమానుల మధ్య ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది..

‘ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ టోర్నీకి మూడు యూఎస్‌ఏ వేదికలను సగర్వంగా ప్రకటిస్తున్నాం. 20 టీమ్స్ పోటీపడే ఈ మెగా టోర్నీ, క్రికెట్‌ని వరల్డ్ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ మార్కెట్‌గా మార్చేందుకు ఓ అద్భుత అవకాశంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. యూఎస్‌ఏ క్రికెట్ టోర్నీ సక్సెస్ అయితే, వ్యూహాత్మకంగా చాలా పెద్ద మార్కెట్ క్రియేట్ అవుతుంది..

యూఎస్‌ఏలో క్రికెట్ ఫ్యాన్స్‌కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, స్టేడియాల కెపాసిటీని పెంచడం జరిగింది. అలాగే అత్యాధునిక వసతులతో క్రికెట్ స్టేడియాలకు మెరుగులు దిద్దుతున్నాం.  వరల్డ్ క్లాస్ టెక్నాలజీని టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీని నిర్వహించబోతున్నాం.. ’ అంటూ కామెంట్ చేశాడు ఐసీసీ సీఈవో జోఫ్ అల్లార్డీస్.. 

ఆతిథ్య దేశాలుగా యూఎస్‌ఏ, వెస్టిండీస్ నేరుగా టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి అర్హత సాధించాయి. అలాగే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 8లో ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్.. టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్నాయి. వీటితో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘాన్ కూడా పొట్టి ప్రపంచ కప్‌కి క్వాలిఫై అయ్యాయి..

యూరప్ నుంచి క్వాలిఫైయర్స్‌ గెలిచిన ఐర్లాండ్, స్కాట్లాండ్... టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి అర్హత సాధించగా ఈస్ట్ ఆసియా ఫసిఫిక్ నుంచి పపువా న్యూ గినీ... ప్రపంచ కప్ ఆడనుంది. అమెరికాస్ క్వాలిఫైయర్స్, 2023, సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 7 వరకూ బర్ముడాలో జరగనుంది.

ఆ తర్వాత నేపాల్‌లో ఆసియా క్వాలిఫైయర్, 2023 అక్టోబర్ 30 నుంచి నవంబర్ 9 వరకూ జరుగుతుంది. ఆఫ్రికా క్వాలిఫైయర్ పోటీలు నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకూ నమీబియాలో జరుగుతాయి. అమెరికా నుంచి ఓ దేశం, ఆసియా క్వాలిఫైయర్ నుంచి రెండు దేశాలు, ఆఫ్రికా క్వాలిఫైయర్ నుంచి మరో 2 దేశాలు.. టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ ఆడతాయి.. 

వచ్చే ఏడాది జూన్‌ 4 నుంచే టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కాబోతోంది. అలాగే ఇదే సమయంలో భారత్‌లో సార్వత్రిక లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఐపీఎల్ 2024 టోర్నీని మార్చి నెలఖారులో ముగించి, మే ప్రథమార్థంలో ముగించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రూపొందిస్తోంది..

Follow Us:
Download App:
  • android
  • ios