క్రికెట్‌కు సంబంధించిన వివరాలను లేదా అఫీషియల్ సమాచారం కావాలంటే అభిమానులు ఎక్కువగా ఆధారపడేది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోషల్ మీడియా ఖాతానే.

అయితే అటువంటి అత్యున్నత సంస్థ సైతం తప్పులో కాలేసింది. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య పుణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా శనివారం ఐసీసీ పొరపాటు చేసింది.

ఆట పూర్తయ్యాక మ్యాచ్ రిపోర్టును తప్పుగా పోస్ట్ చేసింది. ‘‘ఫిలాండర్, కేశవ్‌ల జోడి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఆట పూర్తయ్యేసరికి దక్షిణాఫ్రికా ఆలౌట్ కాకుండా టీమిండియా బౌలర్లు అడ్డుకోలేకపోయారని ట్వీట్ చేసింది.

అదే సమయంలో రెండో రోజు రిపోర్టు అని మరో తప్పు చేసింది. వాస్తవానికి శనివారం భారత బౌలర్ల ధాటికి ఫిలాండర్, కేశవ్‌లు ఎదురొడ్డి నిలిచారు.

అయినప్పటికీ మూడో రోజు ఆట కొద్దిసేపట్లో ముగుస్తుందనగా సఫారీలు చివరి రెండో వికెట్లను కోల్పోయి 275 పరుగులకే ఆలౌటయ్యారు. ఈ సంగతిని ఐసీసీ సోషల్ మీడియా బృందం గుర్తించకపోయే సరికి పెద్ద పొరపాటు జరిగింది. ఈ ట్వీట్‌పై అభిమానులు మండిపడుతున్నారు.