Sri Lanka Cricket: శ్రీలంకపై ఐసీసీ నిషేధం.. క్రికెట్ బోర్డు రద్దు.. అసలు కారణం ఇదే..
Sri Lanka Cricket Team: శ్రీలంక క్రికెట్ బోర్డుపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాత్కాలిక నిషేధం విధించింది. నిషేధం ముగిసే వరకు శ్రీలంక జట్టు ఇక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడదు.
Sri Lanka Cricket Board: ఒకప్పుడు ప్రపంచ ఛాంపియన్ గా వెలుగు వెలిగిన శ్రీలంక క్రికెట్ టీమ్ ఇప్పుడు నిలదొక్కుకోవడానికి అనేక కష్టాలను ఎదుర్కొంటోంది. 2015 ప్రపంచకప్ తర్వాత, కీలక ఆటగాళ్లు రిటైర్ కావడంతో శ్రీలంక జట్టు అకస్మాత్తుగా యువ ఆటగాళ్లను ఆడించే సంక్షోభంలోకి జారుకుంది. అంతర్జాతీయంగా పెద్దగా అనుభవంలేని క్రీడాకారుల కారణంగా 2019 ప్రపంచకప్ సిరీస్‌లో శ్రీలంక జట్టు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో కూడా శ్రీలంక జట్టు పెద్దగా ప్రభావం చూపలేదు. శ్రీలంక జట్టు క్వాలిఫయింగ్ రౌండ్ నుంచే ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆ జట్టు.. సెమీస్ చేరకుండానే పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచి ఇంటిదారి పట్టింది.
వరుస వైఫల్యాలు..
ఇటీవల భారత్‌తో జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్లో శ్రీలంక జట్టు వరుస వికెట్లు కోల్పోయి ట్రోఫీని కోల్పోయింది. ఈ సందర్భంలో, శ్రీలంక జట్టు ప్రపంచ కప్ 2023 సిరీస్‌లో కూడా భారత్‌తో తలపడింది. గతంలోలా కాకుండా కాస్త సవాలుగా ఆడుతుందని భావించిన శ్రీలంక జట్టు కేవలం 55 పరుగులకే ఆలౌటయి 302 పరుగుల తేడాతో చారిత్రాత్మక ఓటమిని చవిచూసింది.
శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు.. ఐసీసీ నిషేధం
వరుస ఓటముల తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దుచేస్తున్నట్టు శ్రీలంక క్రీడాశాఖ మంత్రి తెలిపారు. అలాగే క్రీడా మంత్రి స్వయంగా కొత్త నిర్వాహకులను నియమించారు. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం. క్రికెట్ బోర్డును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే, నిర్ణీత ప్రక్రియలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వమే నిర్వాహకులను నియమించదు. శ్రీలంక ఏకపక్షంగా కొత్త అడ్మినిస్ట్రేటర్లను నియమించడంతో ఐసీసీ శ్రీలంక జట్టుపై తాత్కాలికంగా నిషేధం విధించింది. శ్రీలంక బోర్డును రద్దు చేయడం వెనుక బోర్డులు అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం ఎప్పటివరకు ఉంటుంది..?
శ్రీలంక రద్దు చేసిన పాత శ్రీలంక క్రికెట్ బోర్డును పునరుద్ధరించిన తర్వాత ఐసీసీ నిషేధం ఎత్తివేసే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో కొత్తగా నియమితులైన నిర్వాహకులకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. అలా ఎన్నికలు జరిగితే, నిర్వాహకులను ఎంపిక చేసి, ఐసీసీకి తమ ప్రతిపాదనలు సమర్పించినట్లయితే, వెంటనే నిషేధం ఎత్తివేసే అవకాశముంటుందని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇందుకు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందున శ్రీలంక జట్టు నెల రోజుల పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోవచ్చని భావిస్తున్నారు. ఈ సమయంలో పైన పేర్కొన్న విషయాలు జరగకపోతే మరింత కాలం శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం కొనసాగే అవకాశముంది.