Geoff Allardice: దాదాపు ఎనిమిది నెలలుగా తాత్కాలిక సీఈవో తో నెట్టుకొస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి.. తాజాగా ఆ పదవిలో శాశ్వత సభ్యుడిని నియమించింది.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు ఎనిమిది నెలలుగా తాత్కాలిక ముఖ్య కార్య నిర్వహాణాధికారితో నెట్టుకొస్తున్న ఐసీసీ.. తాజాగా ఆ పదవిలో శాశ్వత సీఈవో (ICC CEO)ను ను నియమించింది. ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్ అలార్డైస్ (Geoff Allardice) ను ఈ పదవిని అప్పగించింది. అంతకుముందు అలార్డైస్.. ఐసీసీ జనరల్ మేనేజర్ గా పని చేశారు. ఆయన అనుభవం, నిర్వహణ సామర్థ్యం తమకెంతో ఉపయోగపడతాయని ఐసీసీ అధ్యక్షుడు (ICC Chief) గ్రెగ్ బార్క్లే (Greg Barcley)ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా గ్రెగ్ మాట్లాడుతూ.. ‘ఐసీసీకి సీఈవోగా జెఫ్ నియమితుడైనందుకు నేను సంతోషిస్తున్నాను. అతడు ఈ పదవిలోకి రావడానికి అంగీకరించినందుకు కృతజ్ఞతలు. ఇటీవలే ముగిసిన పురుషుల టీ20 ప్రపంచకప్ ను అద్భుతంగా నిర్వహించడంలో జెఫ్ ముఖ్య భూమిక పోషించాడు. అద్భుతమైన నాయకత్వంలో టోర్నీని విజయవంతం చేశాడు. ప్రపంచ క్రికెట్ పై జెఫ్ కు అపార విజ్ఞానముంది. రాబోయే దశాబ్దంలో మాకు ఊపిరాడని షెడ్యూల్, టోర్నీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మా సభ్యుల భాగస్వామ్యంతో పనిచేస్తూ వాటిని విజయవంతం చేయడంలో అతడు కీలక పాత్ర పోషిస్తాడు..’ అని తెలిపారు.
ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్.. అక్కడ కొన్నాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఆపైన క్రికెట్ ఆస్ట్రేలియాలో వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆ తర్వాత ఐసీసీ లో ఎనిమిదేళ్ల పాటు జనరల్ మేనేజర్ గా పనిచేశాడు.
Also Read: MS Dhoni: ఏదేమైనా సరే.. నా లాస్ట్ మ్యాచ్ మెరీనా తీరాన్నే ఆడతా.. తమిళ తంబీలకు తలైవా హామీ
తనను ఐసీసీ సీఈవోగా నియమించిన నేపథ్యంలో అతడు మాట్లాడుతూ.. ‘ఐసీసీ సీఈవోగా నియమితుడవడం గొప్ప గౌరవం. గ్రెగ్, ఇతర బోర్డు సభ్యులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వృద్ధి దశలోకి అడుగుపెడుతున్న మా ఆటను మరింత ముందుకు తీసుకుపోయేందుకు నాకు అప్పగించిన ఈ పనిని చేపట్టేందుకు ఉత్సాహంగా ఉన్నాను. క్రికెట్ కు దీర్ఘకాలిక విజయం తో పాటు స్థిరత్వాన్ని అందించడానికి మా సభ్యులతో కలిసి పనిచేయడంపైనే నేను దృష్టి సారిస్తా. గత కొద్దిరోజులుగా నామీద నమ్మకముంచిన ఐసీసీకి ప్రత్యేక ధన్యవాదాలు..’ అని అన్నాడు.
