Asianet News TeluguAsianet News Telugu

Sean Whitehead: ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు.. రికార్డు సృష్టించిన దక్షిణాఫ్రికా బౌలర్.. కుంబ్లే ఘనత సేఫేనా?

10 Wickets In Innings: దక్షిణాఫ్రికా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అద్భుతం జరిగింది. ఆ దేశానికి చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్.. సీన్ వైట్ హెడ్ ఒకే ఇన్నింగ్స్ లో ఏకంగా పది వికెట్లు తన ఖాతాలోనే వేసుకున్నాడు.

South African Spinner Sean Whitehead Took 10 Wickets In Innings First class Match, Creates History
Author
Hyderabad, First Published Nov 21, 2021, 12:45 PM IST

దక్షిణాఫ్రికా లెఫ్టార్మ్ స్పిన్నర్ సీన్ వైట్ హెడ్ (Sean Whitehead) రికార్డు సృష్టించాడు. ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్రకెక్కాడు. వైట్ హెడ్ తాజా ప్రదర్శన.. 115 ఏండ్ల పాటు చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. 1906లో నమోదైన ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్ల రికార్డును వైట్ హెడ్ చెరిపేశాడు. అసలు విషయంలోకి వెళ్తే.. దక్షిణాఫ్రికా (South Africa) ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అద్భుతం జరిగింది. ఆ దేశానికి చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్.. సీన్ వైట్ హెడ్ ఒకే ఇన్నింగ్స్ లో ఏకంగా పది వికెట్లు తన ఖాతాలోనే వేసుకున్నాడు.  ఫోర్ డే ఫ్రాంచైజీ 2021-22 సిరీస్ లో భాగంగా సౌత్ వెస్ట్రన్ డిస్ట్రిక్స్, ఈస్ట్రన్ స్ట్రోమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో  ఈ అద్భుతం చోటు చేసుకుంది. ఇదే మ్యాచ్ లో అతడు తొలి ఇన్నింగ్స్ లో కూడ 5 వికెట్లు తీసుకోవడం విశేషం. 

సౌత్ వెస్ట్రన్ డిస్ట్రిక్స్, ఈస్ట్రన్ స్ట్రోమ్స్ మధ్య జరిగిన నాలుగు రోజుల మ్యాచ్ లో వెస్ట్రన్ డిస్ట్రిక్స్ తరఫున ఆడిన వైట్ హెడ్ మ్యాజికల్ స్పెల్ వేశాడు. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్రన్ స్ట్రోమ్స్ ను 65 పరుగులకే మట్టి కరిపించాడు. రెండో ఇన్నింగ్స్ లో 12 ఓవర్లు వేసిన వైట్ హెడ్.. 36 పరుగులు మాత్రమే ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు స్టంప్స్ రూపంలో.. మూడు ఎల్బీలుగా..  నాలుగు  క్యాచుల ద్వారా.. మరొకటి కాట్ అండ్ బౌల్డ్ గా ఉంది.  అంతేగాక తొలి ఇన్నింగ్స్ లో కూడా వైట్ హెడ్ 5 వికెట్లు తీయడం గమనార్హం. మొత్తంగా ఈ మ్యాచ్ లో అతడు 15 వికెట్లు నేలకూల్చడం విశేషం. వైట్ హెడ్ సూపర్ బౌలింగ్ స్పెల్ తో వెస్ట్రన్ డిస్ట్రిక్స్.. 120 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. 

 

దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్ లో ఇటువంటి రికార్డు 1906లో నమోదైంది. లెగ్ స్పిన్నర్ బెర్ట్ వాగ్లర్.. ఒక ఇన్నింగ్స్ లో 26 పరుగులిచ్చి10 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 115 ఏండ్లకు వైట్ హెడ్.. ఈ రికార్డును తిరగరాశాడు. 

 

అయితే అంతర్జాతీయ క్రికెట్ లో ఒక టెస్టు ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసిన ఘనతను ఇప్పటివరకు ఇద్దరే నమోదు చేశారు. ఆ ఇద్దరూ స్పిన్నర్లే కావడం విశేషం. వారిలోఒకరు ఇంగ్లాండ్ స్పిన్నర్ జిమ్ లేకర్ కాగా మరో వ్యక్తి భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Anil Kumble). 1956లో లేకర్.. ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీయగా.. కుంబ్లే 1999 ఫిబ్రవరి 7న ఢిల్లీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో మ్యాచులో పదికి పది మందిని ఔట్ చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios