Virat Kohli 71st Century: రెండున్నరేండ్లుగా సెంచరీ చేయలేక చతికిలపడుతున్న టీమిండియా  మాజీ సారథి విరాట్ కోహ్లి.. రాబోయే సిరీస్ లలో అయినా ఆ  ముచ్చట తీర్చుకుంటే బెటరేమో.. లేకుంటే.. 

ఒకప్పుడు నీళ్లు తాగినంత ఈజీగా శతకాల మీద శతకాలు బాదిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి.. రెండున్నరేండ్లుగా అదేదో తనకు సంబంధం లేని విషయంగా వ్యవహరిస్తున్నాడు. 2019లో ఈడెన్ గార్డెన్ లో బంగ్లాదేశ్ తో టెస్టు ఆడుతూ సెంచరీ చేయడమే అతడి లాస్ట్ సెంచరీ. ఇక అప్పట్నుంచి ఇప్పటిదాకా ఇక రేపు చేస్తాడా..? ఎల్లుండి చేస్తాడా...? అని అతడి అభిమానులు కండ్లు కాయలు కాచేలా వేచి చూస్తూనే ఉన్నారు. ఆఖరికి ఇటీవలే శ్రీలంకతో మొహాలీ వేదికగా ముగిసిన తన వందో టెస్టులో అయినా కోహ్లి సెంచరీ చేస్తాడని అంతా భావించారు. కానీ ఇందులో కూడా కోహ్లి.. చేతులెత్తేశాడు. అయితే ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా కోహ్లి అభిమాని ఒకరు.. అతడు సెంచరీ చేసేదాకా తాను డేట్ కు వెళ్లనని భీష్మ ప్రతిజ్ఞ చేసింది. 

ముంబై ఇండియన్స్ తో శనివారం పూణే వేదికగా జరిగిన మ్యాచులో కోహ్లి ఫ్యాన్ ఒక అమ్మాయి.. ఒక ఫ్లకార్డుతో దర్శనమిచ్చింది. అందులో ‘విరాట్ నువ్వు 71 వ సెంచరీ సాధించేదాకా నేను డేట్ కు వెళ్లను..’ అని రాసింది. ఈ ఫ్లకార్డును చూపుతూ కోహ్లికి తన మీద ఉన్న ప్రేమను తెలుపుతూనే.. సెంచరీ చేయి మహాప్రభో అని మొరపెట్టుకుంది.

Scroll to load tweet…

అయితే అంతర్జాతీయ కెరీర్ లో రెండున్నరేండ్లుగా సెంచరీ చేయని విరాట్.. మరి ఈ ఫ్యాన్ గర్ల్ కోరికను మన్నిస్తాడా...? గతంలో కూడా పాకిస్తాన్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ సందర్భంగా పలువురు పాక్ అభిమానులు.. వారి దేశంలో విరాట్ 71 వ సెంచరీ సాధించాలని ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ గా మారాయి. 

టీ 20లు, వన్డేలు, టెస్టులు ఆడుతున్న కోహ్లి.. సెంచరీ కోసం మాత్రం ఇంకా నిరీక్షించాల్సే వస్తుంది. అయితే ఈ అమ్మాయి పోస్టర్ కు సంబంధించిన ఫోటో కూడా నెట్టింట వైరల్ అయింది. దానికి పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘పాపం ఆ అమ్మాయి లవర్ కు ఇక కష్టమే..’ అని కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదిలాఉండగా.. కోహ్లి తన కెరీర్ లో టెస్టులలో 27 సెంచరీలు చేయగా వన్డేలలో 43 శతకాలు బాదాడు. మరో సెంచరీ చేస్తే అతడు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ సరసన నిలుస్తాడు. అయితే రెండున్నరేండ్లుగా కోహ్లి.. సెంచరీ ఏమో గానీ కనీసం 90లలోకి కూడా రాలేదు. ఫామ్ తో పాటు గతంలో ఉన్న దూకుడు సైతం కోహ్లిలో మిస్ అయిందని అతడి ఆటను చూసినవారెవరైనా చెబుతారు.