బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం అందరినీ కలచివేసింది. సుశాంత్ ఆత్మహత్య తో ఒక్కొక్కరుగా తాము ఎదుర్కొన్న ఒత్తిడిని కూడా బయటపెడుతున్నారు. ఒకానొక సమయంలో తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నామంటూ చాలా మంది చెబుతున్నారు. కాగా.. తాజాగా వారి జాబితాలోకి క్రికెటర్ శ్రీశాంత్ కూడా చేరిపోయాడు.

తనకు కూడా సూసైడ్ ఆలోచనలు వచ్చాయని శ్రీశాంత్ చెప్పాడు. ‘‘ ఒకప్పుడు నేను చీకటిని చుశానని మీకు తెలుసు. ఆ సమయంలో నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఇంటి నుంచి అసలు బయటకు వచ్చేవాడిని కాదు. అలా ఒంటరిగా గడపుతున్న క్రమంలో ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చాయి’’ అంటూ తాను ఎదుర్కొన్నా చేదు అనుభవాన్ని ఈ సందర్భంగా శ్రీశాంత్‌ గుర్తుచేసుకున్నాడు. 

‘‘నేను ఒంటరిగా నా గదిలో ఉన్నప్పుడు  నిరాశ, ఒత్తిడికి లోనయ్యేవాడిని. కానీ రూమ్‌ నుంచి చిరునవ్వుతో బయటకు వచ్చేవాడిని. ఎందుకంటే నా బలహీనతను, నిరాశను నా తల్లిదండ్రులు చూపించాలనుకోలేదు. ఎందుకంటే బయటి ప్రపంచానికి నేను శ్రీశాంత్‌ని కానీ నా పేరెంట్స్‌కి మాత్రం గోపుని. కానీ నా గదిలో నేను ఏంటన్నది నాకు కూడా తెలియదు. ఇది నేను 2013లో నిరంతరాయంగా పోరాడిన చీకిటి కాలం. అందుకే సుశాంత్ సింగ్ మరణ వార్త నన్ను బాగా ప్రభావితం చేసింది. తన మరణానికి కారణం తెలియగానే ఆ క్షణం సుశాంత్‌లో నన్ను చూసుకున్నాను’’ అంటు చెప్పుకొచ్చాడు. 

కాగా.. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాలకు పాల్పడినట్లు శ్రీశాంత్‌పై ఆరోపణలు రావడంతో అతడిపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే గతేడాది దానిని బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ డీకే జైన్‌ ఏడేళ్లకు కుదించారు. దాంతో అతడి నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుండటంతో అతని రీఎంట్రీ ఖాయమైంది. ఫలితంగా కేరళ తరఫున ఆడటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.