ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో రవీంద్ర జడేజా ఒకడని సీఎస్కే ఆటగాడు దీపక్ చాహర్ పేర్కొన్నాడు. శుక్రవారం పంజాబ్ కింగ్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సీఎస్కే ఆటగాడు దీపక్ చహర్ మీడియాతో మాట్లాడాడు.

అందరి కన్నా బెస్ట్ ఫీల్డర్ రవీంద్ర జడేజా అని.. తన బౌలింగ్ లోనూ జడ్జూ ఎన్నో క్యాచులు పట్టుకున్నాడని చెప్పాడు. తనకైతే మైదానంలో 11మంది జడ్డూలు ఉంటే బాగుండు అనిపిస్తోందని దీపక్ చాహర్ పేర్కొన్నాడు.

రుతురాజ్‌ స్థానంలో గనుక జడ్డూ భాయ్‌ ఉంటే, తొలి ఓవర్‌లోనే గేల్‌ వికెట్‌ లభించేదని అభిప్రాయపడ్డాడు. కాగా పంజాబ్‌ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీపక్‌ చహర్‌ తమ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైన పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన దీపక్‌ చహర్‌ (4/13)కు ‘‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’’ అవార్డు లభించింది.

అయితే, ఈ మ్యాచ్‌లో చహర్‌ వికెట్లతో రాణిస్తే రవీంద్ర జడేజా తన మెరుపులాంటి ఫీల్డింగ్‌ విన్యాసాలతో క్రీడాభిమానుల మనసు దోచుకున్నాడు. ముఖ్యంగా మూడో ఓవర్‌లో కేఎల్‌ రాహుల్‌ను రనౌట్‌ చేసిన విధానం, ఆ తర్వాత చహర్‌ బౌలింగ్‌(ఐదో ఓవర్‌)లో క్రిస్‌ గేల్‌ను అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపించడం పట్ల ఫిదా అవుతున్నారు. ఇలా ఇద్దరు ప్రధాన ఆటగాళ్లను అవుట్‌ చేయడంలో జడ్డూ ప్రధాన పాత్ర పోషించడంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో చహర్‌ మాట్లాడుతూ.. పైవిధంగా స్పందించాడు. కాగా తొలి ఓవర్‌లో చహర్‌ వేసిన బంతిని గేల్‌ షాట్‌ ఆడగా, గాల్లోకి లేచిన బంతిని రుతురాజ్‌ జారవిడిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ సైతం..‘‘ ఇండియాలోని అత్యుత్తమ ఫీల్డర్‌ తను. ఇదే నిజం’’ అంటూ రవీంద్ర జడేజాను ఆకాశానికెత్తాడు.