WTC Final 2023: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ లో భాగంగా నేడు ‘కెన్నింగ్టన్ ఓవల్’ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా కీలక మ్యాచ్ ఆడనున్నాయి.
రెండేండ్ల తర్వాత టీమిండియా మళ్లీ ఐసీసీ ట్రోఫీ ఫైనల్ ఆడుతున్నది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2021-23) ఫైనల్‌కు చేరిన టీమిండియా.. నేడు ఇంగ్లాండ్ లోని ‘కెన్నింగ్టన్ ఓవల్’ గ్రౌండ్ లో ఆస్ట్రేలియాతో తాడో పేడో తేల్చుకోనుంది. నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ టీమిండియాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో భారత జట్టు ఇద్దరు స్పిన్నర్లను ఆడించి తప్పు చేసిందని అదే తప్పు రిపీట్ చేస్తే అంతే సంగతులని చెప్పాడు.
‘ది ఐసీసీ రివ్యూ’ కార్యక్రమంలో భాగంగా నాసిర్ హుసేన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. గత ట్రోఫీలో పరిస్థితులను అంచనా వేయడంలో టీమిండియా చాలా పెద్ద తప్పు చేసిందని అభిప్రాయపడ్డాడు.
నాసిర్ మాట్లాడుతూ.. ‘ఓవల్ లో వాతావరణం బాగుంటే పిచ్ డ్రై గా ఉంటుంది. మబ్బులు పట్టి ఉండటమో లేక వర్షం పడితేనే అప్పుడు పిచ్ మరో రకంగా స్పందిస్తుంది. ఇలా అయితే టీమిండియా ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లు, ఒక పేస్ ఆల్ రౌండర్ (శార్దూల్ ఠాకూర్) తో ఆడాలి. గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో చూసుకుంటే టీమిండియా చాలా పెద్ద తప్పు చేసింది. అక్కడ పరిస్థితులను అంచనా వేయడంలో భారత జట్టు దెబ్బతింది. అప్పుడు టీమిండియా.. జడేజా, అశ్విన్ లను ఆడించింది. అప్పుడు వర్షం పడి వాతావరణం చల్లగా ఉన్నా టీమిండియా మాత్రం ఇద్దరు స్పిన్నర్ల ఫార్ములాతో బరిలోకి దిగింది.
కానీ మీరు న్యూజిలాండ్ జట్టును తీసుకుంటే ఆ టీమ్ ఒక్క ఫ్రంట్ లైన్ స్పిన్నర్ కూడా లేకుండానే బరిలోకి దిగింది. అక్కడ సీమ్, స్వింగ్ డామినేట్ చేసింది. అదే కివీస్ కు విజయాన్ని అందించింది. టీమిండియా మాత్రం ఇద్దరు స్పిన్నర్ల ఫార్ములాతో దిగి బోల్తా కొట్టింది..’అని చెప్పాడు.
అయితే ఓవల్ లో వాతావరణం బాగుంటే ఇద్దరు స్పిన్నర్ల ఫార్ములా వర్కవుట్ అవుతుందని నాసిర్ అన్నాడు. ‘ఓవల్ లో వాతావరణం అనుకూలిస్తే ఇద్దరు స్పిన్నర్లతో ఆడిందే బెటర్. అశ్విన్, జడేజాలు స్పిన్ తో పాటు బ్యాటింగ్ చేయగల సమర్థులు. ఈ ఇద్దరూ వస్తే టీమిండియా బ్యాటింగ్ డెప్త్ మరింత పెరిగినట్టు అవుతుంది. కానీ వర్షం పడితేనో లేక వాతావరణం చల్లగా ఉంటే మాత్రం ఇదే టీమిండియాను దెబ్బతీయొచ్చు. అలాంటి సమయంలో జడేజా, అశ్విన్ లలో ఎవరో ఒకరిని బెంచ్‌కే పరిమితం చేసి మూడో పేసర్ ను తీసుకుంటే ఉత్తమం..’అని కామెంట్స్ చేశాడు.
