తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని..తన ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగ్గానే ఉందని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు కంగారుపడ్డారు. ఈ క్రమంలో లారా స్వయంగా వాయిస్ మెసేజ్ విడుదల చేశారు.

ఆ వాయిస్ మెసేజ్ ని వెస్టిండీస్ క్రికెట్ విడుదల చేసింది. ముంబయిలోని ఓ కార్యక్రమానికి హాజరైన లారాకు ఛాతి నొప్పి రావడంతో ఆయనను ముంబయిలోని పరేల్‌ ప్రాంతంలో గ్లోబల్‌ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితిపై లారా నిన్న రాత్రి ఆడియో మెసేజ్‌ విడుదల చేశారు. ‘నాకు ఏం జరిగిందో అని అందరూ కంగారు పడ్డారు. గుండెలో కొద్దిగా నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను.  ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా చూశాను. నేను ఇంగ్లాండ్‌కు పెద్ద అభిమాని కాకపోయినా ఆ మ్యాచ్‌ చూడాలనిపించింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలుస్తుందని అనుకున్నాను.. అనుకున్నట్లే జరిగింది.  ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. దీంతో ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాను. నా ఫ్యామిలీతో మాత్రమే మాట్లాడగలిగాను. కొన్ని గంటల్లో నా హోటల్‌ గదికి చేరుకుంటాను. నా గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని వాయిస్‌ మెసేజ్‌లో లారా చెప్పారు.