Virat kohli-AB De Villiers: టీమిండియా సారథి విరాట్ కోహ్లి.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే.  అన్ని ఫార్మాట్ల నుంచి ఏబీడీ తప్పుకోవడం తనను తీవ్రంగా బాధించిందని విరాట్ అన్నాడు. 

దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో సుదీర్ఘ కాలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడిన AB De Villiers ఇవాల అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ట్విట్టర్ వేదికగా డివిలియర్స్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అయితే ఏబీడీ నిర్ణయంపై అతడి సహచర ఆటగాడు, డివిలియర్స్ క్లోజ్ ఫ్రెండ్ విరాట్ కోహ్లి స్పందించాడు. ట్విట్టర్ వేదికగా స్పందించిన Virat Kohli ఎమోషనల్ అయ్యాడు. డివిలియర్స్ నిర్ణయంతో తాను షాక్ కు గురయ్యాయనని చెప్పిన విరాట్.. గుండె ముక్కలైనంత పనైందని రాసుకొచ్చాడు. 

కోహ్లి (Virat Kohli Twitter) స్పందిస్తూ.. ‘మా కాలంలో అత్యుత్తమ ఆటగాడు, నేను కలిసిన ఆటగాళ్లలో అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఆర్సీబీకి నీతో కలిసి ఆడిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి బ్రదర్. దానిని నేను ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మన బంధం ఆటకు అతీతమైనది. అది ఇలాగే కొనసాగాలని భావిస్తున్నాను..’ అని పేర్కొన్నాడు.

అంతేగాక డివిలియర్స్ నిర్ణయంతో తన హృదయం ముక్కలైందని విరాట్ తెలిపాడు. కానీ అతడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడని పేర్కొన్నాడు. ‘ఈ నిర్ణయం నా హృదయాన్ని తీవ్రంగా బాధిస్తుంది. కానీ నువ్వు నీకోసం.. నీ కుటుంబం కోసం సరైన నిర్ణయమే తీసుకున్నావు. లవ్ యూ ఏబీ డివిలియర్స్.. ’ అని ట్వీట్ చేశాడు. 

దీనికి ఏబీడీ కూడా రిప్లై ఇచ్చాడు. విరాట్ ట్వీట్ కు డివిలియర్స్ స్పందిస్తూ.. ‘లవ్ యు టూ మై బ్రదర్..’ అని ట్వీట్ చేశాడు. 2011 నుంచి ఆర్సీబీ తరఫున ఆడుతున్న డివిలియర్స్.. కోహ్లితో ప్రత్యేక అనుబంధాన్ని పెంచుకున్నాడు. బెంగళూరు జట్టుకు ఎంత మంది కొత్తవాళ్లు వచ్చినా.. వెళ్లినా ఏబీడీ-కోహ్లి ల స్నేహం మాత్రం చెక్కు చెదరలేదు. ఇద్దరూ కలిసి బెంగళూరుకు ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడటమే గాక జట్టును గెలిపించారు. 

Scroll to load tweet…

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన విదేశీ ఆటగాళ్లలో ఒకడైన ఏబీ.. ఈ లీగ్ లో 5 వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాడు. ఐపీఎల్ లో మొత్తంగా 184 మ్యాచులాడిన ఏబీడీ.. 5162 పరుగులు చేశాడు. ఇక ఆర్సీబీ తరఫున 156 మ్యాచులాడిన మిస్టర్ 360.. 4491 పరుగులు సాధించాడు. మొత్తంగా ఐపీఎల్ లో అతడు మూడు సెంచరీలు చేశాడు. అందులో ఆర్సీబీలో ఉన్నప్పుడే రెండింటిని సాధించాడు. 


ఇదీ చదవండి : AB De villiers: ఆర్సీబీకి బిగ్ షాక్.. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్

Scroll to load tweet…

కాగా నేటి ఉదయం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఏబీ..‘ఇది ఒక అద్భుమైన ప్రయాణం.. చిన్నప్పుడు పెరట్లో మా సోదరులతో కలిసి క్రికెట్ ఆడినప్పట్నుంచి ఇప్పటిదాకా ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించాను. కానీ 37 ఏళ్ల వయసులో ఒకప్పటి కసితో ఆడలేకపోతున్నాను. నాకు సహకరించిన యాజమాన్యాలకు, సహచరులకు ధన్యవాదాలు. ఎక్కడికెళ్లినా నన్ను ఆదరించిన అభిమానులకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను..’ అని పేర్కొన్నాడు. 2018లో దక్షిణాఫ్రికా క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఏబీ.. అప్పట్నుంచి ఐపీఎల్ లో ఆడుతున్నాడు. కానీ గత సీజనే ఏబీకి ఆఖరు సీజన్.