Asianet News TeluguAsianet News Telugu

AB De villiers: ఆర్సీబీకి బిగ్ షాక్.. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్

AB De villiers Retirement: దక్షిణాఫ్రికా క్రికెటర్.. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తాను తప్పుకుంటున్నట్టు  సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించాడు. 

Big Shock To Royal Challengers Bangalore Fans, South Africa Cricketer AB De villiers announces retirement From all forms of cricket
Author
Hyderabad, First Published Nov 19, 2021, 1:38 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) క్రికెట్ అభిమానులకు గుండె పగిలే వార్త ఇది. మిస్టర్ 360 డిగ్రీ గా పిలుచుకునే దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ (Ab De villiers).. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.  గతంలోనే దక్షిణాఫ్రికా జట్టు నుంచి వైదొలిగి ఐపీఎల్ లో కొనసాగిన ఏబీ.. తాజాగా మొత్తం ఆటకే వీడ్కోలు పలికాడు. ఇక భవిష్యత్తులో IPL తో పాటు మరే లీగ్ లోనూ ఏబీని చూడటం కుదరదు. ఇది బెంగళూరు అభిమానులకే కాదు..  క్రికెట్ ను అభిమానిస్తూ ఏబీడీ (ABD) విన్యాసాలను ఆస్వాదించే ప్రతి ఒక్కరికీ బ్యాడ్ న్యూసే. కాగా, అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ (Ab De villiers Retirement) ప్రకటించడంతో వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ఏబీడీ ఆట చూసే అదృష్టం ఆర్సీబీకి లేదు. 

శుక్రవారం సామాజిక  మాధ్యమాల వేదికగా డివిలియర్స్ ఈ ప్రకటన చేశాడు.  ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన బెంగళూరుతో పాటు భారతీయ అభిమానులకు, తన మాతృదేశం దక్షిణాఫ్రికా ఫ్యాన్స్ కు డివిలియర్స్ కృతజ్ఞతలు తెలిపాడు. 

 

ట్విట్టర్ వేదికగా స్పందించిన ఏబీ.. ‘చిన్నప్పట్నుంచి ఇప్పటిదాకా ఆటను ఎంతగానో ఆస్వాదించాను. కానీ 37 ఏండ్ల వయసులో ఒకప్పటి కసి లేదు. దక్షిణాఫ్రికా, ఆర్సీబీ, టైటాన్స్.. ఇలా ఏ జట్టు తరఫునా ఆడినా ఆయా యాజమాన్యాలు నాకు చాలా మంచి అవకాశాలు కల్పించాయి. దీనికి నేను ఎప్పటికీ వాళ్లకు రుణపడి ఉంటాను. ఈ  సందర్భంగా నాతో కలిసి పనిచేసిన, ఆడిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.. నేను ఎక్కడ ఆడినా నాకు ఆదరణ లభించింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, ఇండియాలో అయితే విశేష గుర్తింపు వచ్చింది..’ అని అన్నాడు. 

ఆర్సీబీతో అనుబంధాన్ని పంచుకుంటూ.. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు ఏబీడీకి ప్రత్యేకమైన అనుబంధముంది. ఇదే విషయమై ఏబీ మాట్లాడుతూ.. ‘నేను ఎప్పటికీ ఆర్సీబీ అభిమానిగానే ఉంటాను. ఈ జట్టులోకి పలువురు ఆటగాళ్లు వస్తుంటారు పోతుంటారు కానీ వాళ్లంతా నా కుటుంబ సభ్యులే. ఇప్పుడు నేను హాఫ్ ఇండియన్ ను. అందుకు గర్వంగా ఉంది..’ అంటూ భావోద్వేగంగా మాట్లాడాడు. 

 

హ్యాపీ రిటైర్మెంట్ లెజెండ్.. ఆర్సీబీ 

డివిలియర్స నిర్ణయంపై ఆర్సీబీ స్పందించింది. సుదీర్ఘకాలం తమ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఏబీ రిటైర్మెంట్ గురించి ఫ్రాంచైజీ స్పందిస్తూ.. ‘ఒక శకం ముగిసింది. నీలాంటి క్రికెటర్ మరొకరు లేరు. ఏబీ.. ఆర్సీబీలో లేకపోతే నిన్ను కచ్చితంగా మిస్ అవుతాం. మా జట్టును, క్రికెట్ ప్రేమికులను నువ్వు ఎంతగా అలరించావో అందరికీ తెలుసు. అందుకు నీకు కృతజ్ఞతలు. హ్యాపీ రిటైర్మెంట్ లెజెండ్..’ అని ట్వీట్ చేసింది.  

ఇదీ ప్రస్థానం.. 

2004 నుంచి 2018 దాకా దక్షిణాఫ్రికా తరఫున ఆడిన ఏబీ డివిలియర్స్.. 2004 డిసెంబర్ 17న టెస్టు అరంగ్రేటం చేశాడు. 2005 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ పై మ్యాచ్ తోనే వన్డే కెరీర్ ఆరంభమైంది.  14 ఏండ్ల సుదీర్ఘ కెరీర్ లో ఏబీ.. 114 టెస్టులాడాడు. 8,765 పరుగులు చేశాడు. ఇందులో 22  సెంచరీలున్నాయి. టాప్ స్కోరు 278 నాటౌట్. ఇక  228 వన్డేలాడిన ఏబీ.. 9,577 పరుగులు సాధించాడు. 25 సెంచరీలు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 176. టీ20లలో దక్షిణాఫ్రికా తరఫున 78 మ్యాచులాడాడు. 1,672 పరుగులు చేశాడు. 2018 లో  అంతర్జాతీయ క్రికెట్ కు డివిలియర్స్  వీడ్కోలు పలికాడు. కానీ ఐపీఎల్ లో కొనసాగాడు. 

ఆర్సీబీతో.. 

2011 సీజన్ తో ఐపీఎల్ లో ఆర్సీబీతో ప్రయాణం మొదలుపెట్టిన డివిలియర్స్.. ఆ జట్టు తరఫున 156 మ్యాచులాడాడు. 4491 పరుగులు సాధించాడు. ఇందులో కోహ్లి తో కలిసి కొన్ని చిరస్మరణీయ ఇన్నింగ్సులు ఆడిన ఏబీడీ.. ఐపీఎల్ లో రెండు సెంచరీలు  కూడా చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios