IPL 2023: ఐపీఎల్ -16 లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న ఆఫ్గాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కోహ్లీతో గొడవ తర్వాత అతడు ఫుల్ ఫేమస్ అయ్యాడు.
బౌలర్ గా ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లో బుడిబుడి అడుగులు వేస్తున్న అఫ్గాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ తన ఆటతో కాకుండా కాంట్రవర్సీలతోనే ఫుల్ ఫేమస్ అవుతున్న విషయం తెలిసిందే. బిగ్ బాష్ లీగ్, పాకిస్తాన్ క్రికెట్ లీగ్ తో పాటు ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా కోహ్లీతో వివాదం తర్వాత నిత్యం విరాట్ తో సోషల్ మీడియాలో గిల్లికజ్జాలు ఆడుతున్న నవీన్ పేరు నెట్టింట బాగా నానుతోంది. తాజాగా నవీన్.. తనకు స్లెడ్జింగ్ అంటే ఇష్టముందని, తనది అటువంటి మనస్తత్వం ఉండదని చెప్పుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
లక్నో సూపర్ జెయింట్స్ విడుదల చేసిన ఓ వీడియోలో అవేశ్ ఖాన్ తో కలిసి నవీన్ ఓ చిట్ చాట్ ప్రోగ్రామ్ చేశాడు. ఇందులో నవీన్ కు స్లెడ్జింగ్ గురించి ఓ ప్రశ్న వచ్చింది. దానికి అతడు చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యం కలుగక మానదు.
క్రికెట్ ఫీల్డ్ లో మీకు నచ్చిన ఫేవరేట్ స్లెడ్జ్.. అది మీరు చేసిందైనా, మీకు ఎవరైనా చేసిందైనా..? అన్న ప్రశ్న వచ్చింది. దానికి నవీన్ సమాధానం చెబుతూ.. ‘నేను ఎవరితోనూ స్లెడ్జ్ కు దిగలేదు. అది నాకు అలవాటు లేని పని. ఒక్కటి మా (అఫ్గానిస్తాన్ లో) ఫస్ట్ క్లాస్ గేమ్ లో మాత్రం ఒకటి అయింది. నేను నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్నా. అవతలి ఎండ్ లో ఓ బ్యాటర్ ఉన్నాడు. అతడిని మా అపోజిషన్ టీమ్ వాళ్లు స్లెడ్జ్ చేశారు..’ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఇదే వీడియో నవీన్.. గౌతం గంభీర్ తనకు ఐపీఎల్ డెబ్యూలో చెప్పిన సూచనలు, లక్నో టీమ్ లో తనకు సన్నిహితులు, ఇతరత్రా వివరాలు పంచుకున్నాడు. అవేశ్ ఖాన్ కూడా నవీన్ కోసం షోలే సినిమాలోని ‘హే దోస్తీ’ పాట పాడటం విశేషం.
ఐపీఎల్ -16లో 11 మ్యాచ్ లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్.. ఐదింట్లో గెలిచి ఐదు ఓడి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. బెంగళూరుతో మ్యాచ్ లో ఓడాక ఆ జట్టు చెన్నైతో ఆడిన మ్యాచ్ వర్షం కారణంగా అర్థాంతరంగా రద్దవడం.. గుజరాత్ తో ఓడటం ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ సీజన్ లో ఆ జట్టు ఈనెల 13న హైదరాబాద్ తో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో ఫలితం లక్నోకు వ్యతిరేకంగా వస్తే ఇక ఆ జట్టు కూడా బ్యాగ్ సర్దుకోవడమే..!
