2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో 673 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్.. 20 ఏళ్లుగా చెక్కు చెదరని ‘మాస్టర్’ రికార్డు.. నమీబియాతో మ్యాచ్‌లో సచిన్ ఆడిన షాట్‌కి..
క్రికెట్ ప్రపంచాన్ని రెండు దశాబ్దాల పాటు ఏలిన క్రికెటర్ సచిన్ రమేశ్ టెండూల్కర్. 2003 వన్డే వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్ సృష్టించిన విధ్వంసం వేరే లెవెల్. ఆ టోర్నీలో ఓ సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలతో 11 మ్యాచుల్లో 673 పరుగులు చేశాడు సచిన్ టెండూల్కర్..
ఈ వరల్డ్ కప్ ముగిసి 20 ఏళ్లు దాటుతున్న సచిన్ టెండూల్కర్ రికార్డు ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. 2003 వన్డే వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులు చేస్తే, 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఐదు సెంచరీలతో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ.. 648 పరుగుల వద్ద ఆగిపోయాడు...
2003లో కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు సచిన్ టెండూల్కర్ భారీ షాట్లతో విరుచుకుపడేవాడు. గ్రూప్ స్టేజీలో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 151 బంతుల్లో 18 ఫోర్లతో 152 పరుగులు చేసి భారీ శతకం నమోదు చేశాడు సచిన్ టెండూల్కర్. భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ మ్యాచ్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు...
వీరిద్దరి విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 311 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన వీరేంద్ర సెహ్వాగ్ 24 పరుగులు చేయగా యువరాజ్ సింగ్ 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...
ఈ లక్ష్యఛేదనలో నమీబియా 42.3 ఓవర్లు బ్యాటింగ్ చేసి 130 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, దినేశ్ మోంగియో రెండేసి వికెట్లు తీయగా యువరాజ్ సింగ్ 4.3 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 మెయిడిన్లతో 4 వికెట్లు పడగొట్టాడు...
ఈ మ్యాచ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను ఇప్పటికీ మరిచిపోలేని అంటున్నాడు పాకిస్తాన్ అంపైర్ అలీం దార్. ఇన్నింగ్స్ 43వ ఓవర్‌లో జోర్న్ కార్జే బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదాడు సచిన్ టెండూల్కర్. ఐదో బంతికి కార్జే బంతిని వేగంగా డెలివరీ చేయగా, సచిన్ టెండూల్కర్ అంతే వేగంగా అతని వైపు స్ట్రైయిక్ డ్రైవ్ ఆడాడు.. గంగూలీ పక్కనే నిలబడిన అంపైర్ అలీం దార్, వెంటనే ప్రమాదాన్ని గమనించి, కిందకి వంగి బాల్ నుంచి తప్పించుకున్నాడు...
అంపైర్ అలీం దార్ క్షణం ఆలస్యం చేసి ఉంటే ఈ షాట్ అతని ముఖానికి బలంగా తగిలి ఉండేది. ‘ఆ రోజు ఆ షాట్ తగిలి ఉంటే నేను చనిపోయి ఉండేవాడిని. నాకు కళ్లు సరిగ్గా పనిచేయడం వల్ల, నేను వేగంగా స్పందించడం వల్ల బతికిపోయా... నేను క్రికెట్ ఆడాలని అనుకున్నా. నా అంతర్జాతీయ అంపైరింగ్ కెరీర్‌లో అలాంటి షాట్ ఎప్పుడూ చూడలేదు. అదో పవర్‌ఫుల్ బుల్లెట్‌లా దూసుకొచ్చింది. అలాంటి షాట్ ఆడినందుకు సచిన్ టెండూల్కర్ క్షమాపణలు కోరారు. ఒక్కసారి కాదు, ఆ తర్వాత రెండు ఓవర్లు బ్యాటింగ్ చేసి, అవుట్ అయ్యేవరకూ సారీ చెబుతూనే ఉన్నాడు... అతని ఆట రఫ్‌గా ఉన్నా, తను ఎంత మృదు స్వభావియో అప్పుడే తెలిసింది...’ అంటూ చెప్పుకొచ్చాడు పాక్ అంపైర్ అలీం దార్..
సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 23న ఇండియా, నమీబియా మధ్య ఈ మ్యాచ్ జరిగింది.
