వన్డేల నుంచి తప్పుకున్నా! ఐదో టెస్టు ముగిశాక హాలీడేస్‌కి వెళ్తున్నా... దాని గురించే ఆలోచిస్తున్నా! యాషెస్ సిరీస్ ఫైనల్ టెస్టుకి ముందు బెన్ స్టోక్స్ కామెంట్స్.. 

క్రికెట్ ప్రపంచ చరిత్రలో అత్యంత హై డ్రామా నడిచిన ఫైనల్ మ్యాచ్.. 2019 వరల్డ్ కప్ ఫైనల్. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్‌లో మ్యాచ్ టైగా ముగిసింది. సూపర్ ఓవర్‌‌లో కూడా ఇరు జట్లు సమానంగా పరుగులు చేయడంతో ఎక్కువ బౌండరీలు బాదిన ఇంగ్లాండ్‌కి వరల్డ్ కప్‌ దక్కింది..

2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫీల్డర్ మార్టిన్ గుప్తిల్ వేసిన త్రో, బెన్ స్టోక్స్ బ్యాటుకి తగిలి, బౌండరీకి దూసుకెళ్లింది. అంపైర్లు ఈ బంతికి ఏకంగా 5 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. దీని గురించి ఏడాదికి పైగా చర్చ జరిగింది..

బ్యాటుకి తగిలి బౌండరీకి వెళ్లినందుకు ఫోర్ ఇచ్చినా, 1 పరుగు తేడాతో న్యూజిలాండ్ గెలిచి ఉండేది. అంపైర్లు కూడా ఈ నిర్ణయం తప్పేనని, వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కామెంట్లు చేశారు. ఈ వివాదం తర్వాత సూపర్ ఓవర్ డ్రా అయితే మళ్లీ సూపర్ ఓవర్ పెట్టేలా రూల్స్ మార్చింది ఐసీసీ..

ఇంత కాంట్రవర్సీ క్రియేట్ చేసినా, 2019లో మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ టోర్నీని గెలిచి... ఎన్నో ఏళ్ల కళను సాకారం చేసుకుంది ఇంగ్లాండ్. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత మెంటల్ హెల్త్ పేరుతో కొన్నాళ్లు క్రికెట్‌కి దూరంగా ఉన్న బెన్ స్టోక్స్, బిజీ షెడ్యూల్ కారణంగా వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు రిటైర్మెంట్ ప్రకటించాడు..

ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్‌గా ఉన్న బెన్ స్టోక్స్, టీ20ల్లోనూ ఆడుతున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్‌కి ముందు వన్డే రిటైర్మెంట్ వెనక్కి తీసుకునే ఆలోచన ఉందా? అనే ప్రశ్న, బెన్ స్టోక్స్‌కి ఎదురైంది...

‘నేను వన్డేల నుంచి రిటైర్ అయ్యాను. మళ్లీ యూ టర్న్ తీసుకునే ఆలోచన లేదు. యాషెస్ సిరీస్ ముగిసిన తర్వాత నేను హాలీడేకి వెళ్తున్నా. ఇప్పటికైతే ఆ విషయం గురించే ఆలోచిస్తున్నా..’ అంటూ కామెంట్ చేశాడు బెన్ స్టోక్స్..

‘తొలి టెస్టులో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసినందుకు నేనేం ఫీల్ అవ్వడం లేదు. 2025లో ఆస్ట్రేలియాలో జరిగే యాషెస్ సిరీస్‌లో మేం గెలవడానికి మార్గాలు వెతికే అవకాశం దొరికింది. ఇంతకుముందు కొన్నిసార్లు ఆస్ట్రేలియాలో ఆడాను. ఇప్పటికైతే ఐదో టెస్టుపైనే ఫోకస్ పెట్టాం... ’ అంటూ కామెంట్ చేశాడు బెన్ స్టోక్స్..

తన కెరీర్‌లో 105 వన్డేలు ఆడిన బెన్ స్టోక్స్, 38.98 యావరేజ్‌తో 2924 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 74 వికెట్లు తీశాడు. 

2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్, జాసన్ రాయ్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్ వికెట్లను త్వరత్వరగా కోల్పోయింది. 59 పరుగులు చేసిన జోస్ బట్లర్‌తో కలిసి ఐదో వికెట్‌కి 110 పరుగుల భాగస్వామ్యం జోడించిన బెన్ స్టోక్స్, 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి... మ్యాచ్‌ని టై చేయగలిగాడు..

2 పరుగులు చేసిన క్రిస్ వోక్స్, 10 పరుగులు లియామ్ ఫ్లంకెట్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పిన బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, మార్క్ వుడ్ డకౌట్ అయినా సరిగ్గా 50 ఓవర్లలో 241 పరుగులకు చేర్చగలిగాడు.

సూపర్ ఓవర్‌లో ఇంగ్లాండ్ 15 పరుగులు చేయగా న్యూజిలాండ్ కూడా సరిగ్గా 15 పరుగులే చేయగలిగింది. సూపర్ ఓవర్‌లో ఆఖరి బంతికి రెండో పరుగు కోసం ప్రయత్నించిన మార్టిన్ గుప్తిల్ రనౌట్ అయ్యాడు. దీంతో విజేతను నిర్ణయించేందుకు బౌండరీలను లెక్కబెట్టారు అంపైర్లు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో 26 బౌండరీలు ఉండగా, న్యూజిలాండ్ 17 బౌండరీలే బాదింది. దీంతో ఇంగ్లాండ్, వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీ విజేతగా నిలిచింది..