Sourav Ganguly: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్విటర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. తాను రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు హింట్ కూడా ఇచ్చాడు. మరి బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టేనా..?
టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాడా..? బీసీసీఐ అధ్యక్ష పదవికి అతడు రాజీనామా చేసినట్టేనా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. తాజాగా అతడు చేసిన ట్వీట్ అదే విషయాన్ని సూచిస్తున్నది. తాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పిన దాదా.. బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే విషయంపై స్పష్టతనివ్వలేదు.
ట్విటర్ వేదికగా గంగూలీ స్పందిస్తూ.. ‘నేను క్రికెట్ ప్రయాణం ప్రారంబించి ఈ ఏడాదికి 30 ఏండ్లు (1992 నుంచి) గడుస్తున్నది. అప్పటినుంచి నాకు క్రికెట్ అన్నీ ఇచ్చింది. అన్నింటికంటే ముఖ్యం నాకు మీ (ప్రేక్షకుల) అభిమానాన్ని ఇచ్చింది. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన, నేనిక్కడకు చేరుకోవడానికి మద్దతునిచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ఇక ఇప్పుడు నేను కొత్తగా ఒకటి (?) ప్రయత్నిద్దామనుకుంటున్నాను. అది ప్రజలకు మరింత సేవ చేసేది.. మీ మద్దతు అక్కడ (?) కూడా ఉంటుందని ఆశిస్తున్నాను..’ అని ట్వీట్ చేశాడు.
అప్పట్నుంచే ఊహాగానాలు..!!
ఈ ట్వీట్ లో గంగూలీ తాను చెప్పదలుచుకున్న విషయాన్నైతే సూటిగా చెప్పేశాడు. తాను రాజకీయాలలోకి వెళ్తున్నట్టు దాదా చెప్పకనే చెప్పాడు. గత ఏడాదిన్నర కాలంగా దాదా రాజకీయాల్లోకి వస్తాడని ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. గతేడాది ముగిసిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలోనే గంగూలీ బీజేపీ తరఫున పోటీ చేస్తాడని అంతా భావించారు. ఆ మేరకు దాదాతో బీజేపీ కూడా జోరుగా చర్చలు సాగించింది. కానీ అప్పుడు దాదా సుముఖంగా లేకపోవడంతో ఆ విషయం మరుగున పడింది.
కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్ తో బీసీసీఐ ఆఫీస్ లో ‘దాదాగిరి’ (అధ్యక్ష పదవి) ముగియనున్నది (2019 నుంచి కొనసాగుతున్నాడు). పదవీకాలం ముగియడానికి ఇంకా మూడు నెలలే టైమ్ ఉంది. అయితే గంగూలీ.. మళ్లీ బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ చేస్తాడని ఊహాగానాలు కూడా వెలువడటం లేదు. దీనికితోడు గత నెల 10న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. కోల్కతాలో గంగూలీని కలిశారు. అయితే ఇది రాజకీయ భేటి కాదని బయటకు చెప్పుకున్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం గంగూలీని బరిలోకి దింపేందుకు బీజేపీ నాయకత్వం ఇప్పట్నుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్టు గుసగుసలు వినిపించాయి. ఇది జరిగిన కొద్దిరోజులకే.. గంగూలీ తాను నాలుగు దశాబ్దాలుగా ఉంటున్న ఇంటిని అమ్మి కొత్త ఇంట్లోకి మారడం, తాజాగా ఆసక్తికర ట్వీట్ చేయడం వెనుక భారీ స్కెచ్ ఉన్నదని అవగతమవుతూనే ఉన్నది.
రాజకీయాలు తప్పేం కాదే : గంగూలీ
భారత రాజకీయాల గురించి ఎవరైనా దిగ్గజ క్రికెటర్ ను అడిగితే మాట మారుస్తాడు. కానీ దాదా మాత్రం అవి మరీ జనం అనుకునేంత చెడ్డగా లేవని చెప్పడం గమనార్హం. ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ మర్యాద ఇచ్చి పుచ్చుకుంటాను. రాజకీయాలు చెడ్డవేం కావు. మన దేశంలో మహా మహా రాజకీయ నాయకులున్నారు. దేశాన్ని నడిపిస్తున్న ఎంతో మంది నాయకులు ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. రాజకీయాలు చెడ్డవని ఎందుకనుకుంటున్నారు..? మంచి నాయకులు కూడా ప్రజల్లో ఉన్నారు. అయితే నా రాజకీయ ప్రవేశం పై ఇప్పుడే ఏం చెప్పలేను. దానికి కొంత టైమ్ పడుతుంది..’ అని అన్నారు. మరి ఆ సమయమిదేనో కాదో గంగూలీనే స్పష్టం చేయాలి.
తూచ్.. రాజీనామా లేదు గీజినామా లేదు..
దాదా ట్వీట్ నేపథ్యంలో జాతీయ మీడియాలో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంది గంగూలీ తప్పుకుంటున్నట్టు కథనాలు వచ్చాయి. అయితే దీనిపై తాజాగా బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించాడు. ఇదే విషయమై ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘అబ్బే లేదే.. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ రాజీనామా చేయలేదు..’ అని సమాధానమిచ్చాడు.
