హైదారాబాద్: టీమిండియా యువ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతిచెందారు. అయితే తండ్రిని చివరిచూపు కూడా చూసుకోలేకపోతున్నాడు సిరాజ్. 

ఇటీవలే యూఏఈలో ఐపిఎల్ ను ముగించుకున్న సిరాజ్ అక్కడినుండి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టెస్ట్ సీరిస్ కు అతడు ఎంపికయ్యాడు. డిసెంబర్ లో టెస్ట్ సీరిస్ ప్రారంభంకానుండగా ప్రస్తుతం అతడు బయోబబుల్‌లో ఉన్నాడు. అందువల్లే అతడు అంత్యక్రియలకు దూరం కానున్నాడు.

అయితే తండ్రి చనిపోయినట్లు తెలుసుకున్న సిరాజ్ శోకసంద్రంలో మునిగిపోయినట్లు  తెలుస్తోంది. పేద కుటుంబంలో పుట్టిన తనను భారత క్రికెటర్‌గా తీర్చిదిద్దడంలో తండ్రి కీలకపాత్ర పోషించాడంటూ సిరాజ్ కన్నీటిపర్యంతం అవుతున్నాడట. ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తూనే తన కలను సాకారం చేయడానికి తండ్రి ఎన్నో త్యాగాలు చేశాడని... తన సుఖాన్ని పూర్తిగా మరిచాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట సిరాజ్.