టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి రోజుకొక కొత్త వార్త తెలుస్తూనే ఉంటుంది. అంతేకాకుండా ఆయనలోని గొప్ప నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వానికి సంబంధించి పలువురు ప్రశంసలు  కురిపిస్తూనే ఉంటారు.

కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా, వ్యూహకర్తగా విభిన్న సేవలను ధోని అందిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో టీమిండియా బౌలర్ కుల్‌దీప్ యాదవ్ ‌ధోనీలోని కోచ్ గురించి ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు.

మ్యాచ్ ఆడుతున్నప్పుడు తనకు కోచ్ లేని లోటును ధోనీ తీర్చేవాడని.. తనతో పాటు చాహల్‌కు కూడా మిస్టర్ కూల్ ఎన్నో విలువైన సలహాలు ఇచ్చేవాడని కుల్‌దీప్ చెప్పాడు.

మ్యాచ్ ఆసాంతం ఓ కోచ్ ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తాడో అవన్నీ ధోనీ ఇచ్చేవాడని.. అందువల్ల తనకు కోచ్ లేడనే విషయాన్ని తాను పూర్తిగా మరిచిపోతానని కుల్‌దీప్ చెప్పాడు.

బంతిని ఎక్కువగా గింగిరాలు తిప్పడంపైనే దృష్టి సారించమని ధోని సూచించేవాడని ఆయన తెలిపాడు. మిస్టర్ కూల్ వికెట్ వెనుక ఉన్నాడంటే ఒత్తిడి మొత్తం పోతుందని తెలిపాడు.

అంతేకాకుండా ఫీల్డింగ్ సెట్ చేసే సమయంలో తనకు సూచనలిచ్చేవాడని, కొన్నిసార్లు ధోనియే మొత్తం ఫీల్డర్లను సెట్ చేసి ఏ బంతి వేయాలో కూడా ముందుగానే చెప్పేవాడని తెలిపాడు. కోహ్లీ కూడా ధోనిలాగే సూచనలు ఇస్తున్నా.. ధోని కూడా మాతో వుంటే బాగుండు అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుందని కుల్‌దీప్ తన మనసులోని మాటను చెప్పాడు.