ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సీరిస్ లో ఆతిథ్య జట్టు అద్భుత విజయాన్ని  అందుకుంది. ఆస్ట్రేలియా జట్టు నిర్దేశించిన 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లాండ్ సత్తా చాటింది. ముఖ్యంగా బెన్ స్టోక్స్ 135 పరుగులతో అజేయ సెంచరీతో ఒంటరిపోరాటం  చేసి తమ జట్టును విజయతీరాలకు  చేర్చాడు. 11వ నంబర్ ఆటగాడు జాక్ లీచ్ తో  కలిసి 73పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మరీ స్టోక్స్ తమ జట్టును గెలిపించుకున్నాడు. అయితే ఈ జట్టును విడదీసే అద్భుత అవకాశాన్ని ఆసిస్ ఆటగాడు నాథన్ లియాన్ చేజేతులా  చేజార్చుకుని ఆసిస్ ఓటమికి కారకుడయ్యాడు. 

మ్యాచ్ చివరిదశకు చేరుకున్న సమయంలో నాథన్ లియాన్ బౌలింగ్ కు దిగాడు. మరో రెండు పరుగులు చేస్తే ఇంగ్లాండ్ గెలుస్తుంది. ఒక్క వికెట్ పడగొడితే ఆసిస్ ను విజయం వరిస్తుంది. ఈ సమయంలో లియాన్ వేసిన బంతిని స్టోక్స్ రివర్స్ స్వీప్ షాట్ ఆడుతూ పాయింట్ దిశగా తరలించాడు. దీంతో నాన్ స్ట్రైక్ ఎండ్ లో వున్న లీచ్ పరుగుకోసం ప్రయత్నిస్తూ దాదాపు పిచ్ మధ్యలోకి వచ్చాడు.   

అయితే బంతి నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్లడంతో స్టోక్స్ అతన్ని వెనక్కిపంపాడు. అప్పటికే బంతిని పీల్డర్ బౌలర్ లియాన్ వైపు త్రో చేశాడు. కానీ ఆ బంతిని అందుకోలేక లీచ్ ను రనౌట్ చేసే అవకాశాన్ని లియాన్ చేజేతులా మిస్ చేశాడు. దీంతో ఆ తర్వాత కాస్త జాగ్రత్తగా ఆడి స్టోక్స్  మిగతా రెండు పరుగులను రాబట్టాడు. ఇలా ఉత్కంఠపోరులో ఆస్ట్రేలియాపై ఇంగ్లీష్ జట్టు విజయం సాధించింది. ఐదు టెస్టుల యాషెస్ సీరిస్ లో 1-1 పాయింట్లతో ఇరుజట్లు సమానంగా నిలిచాయి. 

కీలక సమయంలో ప్రత్యర్థిని రనౌట్ చేసే అవకాశాన్ని చేజేతులా వదిలేసిన లియాన్ పై  ఆసిస్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అతడు కేవలం రనౌట్ అవకాశాన్నే కాదు ఆసిస్ విజయాన్ని కూడా వదిలిపెట్టాడని ఆరోపిస్తున్నాడు. ఈ ఓటమికి అతడే కారణమంటూ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. 

వీడియో