ప్రాక్టీస్ సెషన్స్‌లో రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ ద్రావిడ్‌లతో మాట్లాడుతున్న ఫోటో షేర్ చేసిన రవీంద్ర జడేజా.. ‘ఇద్దరు G.O.A.Ts మధ్య ఓ గుర్రం’ అంటూ కాప్షన్... 

ఐపీఎల్ 2023 సీజన్‌లో 20 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. జడ్డూ బ్యాటింగ్ కోసం ఐసీసీ నెం.1 టెస్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌ని రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసిన టీమిండియా, భారీ మూల్యం చెల్లించుకుంది..

అశ్విన్‌కి తుది జట్టులో చోటు ఇవ్వకపోవడంపై సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, సునీల్ గవాస్కర్ వంటి మాజీ క్రికెటర్లు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో వెస్టిండీస్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో అశ్విన్, జడేజా ఇద్దరూ కీలకం కాబోతున్నారు..

మొదటి టెస్టు ఆరంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ ద్రావిడ్‌లతో మాట్లాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రవీంద్ర జడేజా.. ‘ఇద్దరు G.O.A.Ts మధ్య ఓ గుర్రం’ అంటూ కాప్షన్ జోడించి, ఇన్‌స్టాలో స్టేటస్ పెట్టాడు. దీనికి రవిచంద్రన్ అశ్విన్ క్రేజీగా స్పందించాడు.. ‘రేయ్... ’ అంటూ పగలబడి నవ్వుతున్నట్టుగా ఎమోజీలను జత చేశాడు అశ్విన్.. 

Scroll to load tweet…

టీమిండియా తర్వాతి టెస్టు కెప్టెన్ రేసులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరూ ఉన్నారు. అయితే రవీంద్ర జడేజా, కెప్టెన్‌గా ఐపీఎల్ 2022 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. కాబట్టి అతను తిరిగి కెప్టెన్సీ తీసుకుంటాడా? అనేది చర్చనీయాంశంగా మారింది. రవిచంద్రన్ అశ్విన్‌కి ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. అలాగే తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లోనూ కెప్టెన్సీ చేస్తున్నాడు.

మరోవైపు క్రికెటర్‌గా, అండర్19 కోచ్‌గా ఎంతో సక్సెస్ సాధించిన తర్వాత ఎన్నో అంచనాల మధ్య టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు రాహుల్ ద్రావిడ్. స్వదేశంలో ఘన విజయాలు అందుకున్న టీమిండియా, రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో విదేశాల్లో చెప్పుకోదగ్గ విజయాలు అందుకోవడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది..

బంగ్లాదేశ్ టూర్‌లో వన్డే సిరీస్‌ కోల్పోయిన టీమిండియా, ఆసియా కప్ 2022 టోర్నీలోనూ ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీస్‌లో ఓడిన భారత జట్టు, సౌతాఫ్రికా పర్యటనలో 2-1 తేడాతో టెస్టు సిరీస్ ఓడింది..

కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడిన భారత జట్టు, 3-0 తేడాతో క్లీన్ స్వీప్ అయ్యింది. అన్నింటికీ మించి బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్న పిచ్‌పైన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌‌షిప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లోనూ చేతులు ఎత్తేసింది..

ఈ వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కి, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ చాలా కీలకం. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ గెలిచి, టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి సగర్వంగా తప్పుకోవాలని చూస్తున్నాడు రాహుల్ ద్రావిడ్..

దానికి ముందు వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్‌లో ఘన విజయాలు అందుకుని, తమ గణాంకాలు మెరుగుపర్చుకోవాలని చూస్తున్నారు టీమిండియా ప్లేయర్లు. రవిచంద్రన్ అశ్విన్ మరో 3 వికెట్లు తీస్తే, 700 అంతర్జాతీయ వికెట్లు పూర్తి చేసుకుంటాడు.