పురుషులతో సమానంగా మహిళలకు మ్యాచ్ ఫీజు... చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ...
పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు చెల్లించాలని నిర్ణయం తీసుకున్న బీసీసీఐ... వచ్చే ఏడాది ప్రారంభం కానున్న వుమెన్స్ ఐపీఎల్..
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పురుష క్రికెటర్లకు కోట్లకు కోట్లు చెల్లిస్తూ, మహిళల క్రికెటర్ల విషయానికి వచ్చేసరికి చిల్లర వేస్తున్నారని ఎన్నో ఏళ్లుగా విమర్శలు ఎదుర్కొంటోంది భారత క్రికెట్ బోర్డు. ఎట్టకేలకు ఈ విమర్శలకు చెక్ పెడుతూ, పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది...
భారత పురుష క్రికెటర్లు ఒక్కో టెస్టు మ్యాచ్‌కి రూ.15 లక్షలు, వన్డేలకి రూ.6 లక్షలు, టీ20లకు రూ.3 లక్షలను మ్యాచ్ ఫీజు రూపంలో తీసుకుంటున్నారు. మహిళా క్రికెటర్లకు కూడా ఇకపై ఇదే మొత్తం చెల్లించబోతున్నట్టు బీసీసీఐ సెక్రటరీ జై షా ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు..
‘వివక్షను రూపమాపడానికి బీసీసీఐ ముందడుగు వేసిందని చెప్పడానికి గర్వపడుతున్నా. బీసీసీఐ కాంట్రాక్ట్ కలిగిన భారత మహిళా క్రికెటర్లకు కూడా సమాన వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. క్రికెట్‌లో సమానత్వం తీసుకొచ్చే శకంలోకి అడుగుపెట్టాం. అందుకే పురుషులతో సమానంగా మహిళలకు సమాన మ్యాచ్ ఫీజు చెల్లించబోతున్నాం... మహిళలకు సమాన మ్యాచ్ ఫీజు ఇవ్వాలనే నా లక్ష్యం నెరవేరేందుకు మద్ధతుగా నిలిచిన అపెక్స్ కౌన్సిల్‌కి నా ధన్యవాదాలు... . ’ అంటూ ట్వీట్ చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా..
మ్యాచ్ ఫీజుని సమానం చేసినా సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా అందే మొత్తం విషయంలో మాత్రం మహిళా క్రికెటర్లకు అన్యాయమే జరుగుతోంది. A+ కెటగిరీలో ఉన్న భారత పురుష క్రికెటర్లకు ఏడాదికి రూ. 7 కోట్లు, A కేటగిరీలోని ప్లేయర్లకు ఏడాదికి రూ.5 కోట్లు సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా చెల్లిస్తోంది బీసీసీఐ. B కేటగిరిలో ఉన్న ప్లేయర్లకు రూ.3 కోట్లు చెల్లిస్తుంటే, సీ కేటగిరిలో ఉన్న ప్లేయర్లు ఏడాదికి రూ.1 కోటి కాంట్రాక్ట్ రుసుముగా పొందుతున్నారు...
మహిళా క్రికెట్ టీమ్‌లో గ్రేడ్ A కాంట్రాక్ట్ దక్కించుకున్న ప్లేయర్లకు ఏడాదికి రూ.50 లక్షలు, గ్రేడ్ B కేటగిరీ ప్లేయర్లకు రూ.30 లక్షలు, గ్రేడ్ సీ కేటగిరీ ప్లేయర్లకు రూ.10 లక్షలు వార్షిక వేతనంగా దక్కుతోంది. పురుష క్రికెటర్లకు రూ.7 కోట్ల నుంచి రూ.1 కోటి దాకా వార్షిక వేతనంగా అందిస్తున్న బీసీసీఐ, అందులో 10 శాతం మాత్రమే మహిళా క్రికెటర్లకు చెల్లిస్తోంది...
ఈ వివక్షపై వచ్చిన విమర్శలకు మహిళా క్రికెట్ ద్వారా ఆదాయం రావడం లేదని సమాధానంగా చెప్పుకుంటూ వచ్చింది. అయితే గత ఏడాదిగా మహిళా క్రికెట్‌కి కూడా ఆదరణ పెరిగింది. కామన్వెల్త్ గేమ్స్ 2022తో పాటు ఇండియా- ఇంగ్లాండ్ సిరీస్‌కి, వుమెన్స్ ఆసియా కప్ 2022 సిరీస్‌కి మంచి ఆదరణ దక్కింది. దీంతో సెంట్రల్ కాంట్రాక్ట్ ఫీజు విషయంలో కూడా బీసీసీఐ మార్పులు చేసే అవకాశం ఉంది...
వచ్చే ఏడాది వుమెన్స్ ఐపీఎల్ నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీసీసీఐ, దేశంలో మహిళా క్రికెట్ అభివృద్ధికి మెల్లిమెల్లిగా అడుగులు వేస్తోంది..