టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించగలిగిన సమర్థుడు. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ పరుగుల యంత్రం కోసం ఐపీఎల్‌లో ఫ్రాంచైజీలు ఎగబడుతుంటాయి.

అయితే ఇందుకు విరుద్ధంగా ఢిల్లీ క్యాపిటల్స్.. కోహ్లీ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ప్రదీప్ సంగ్వాన్‌ను ఎంపిక చేసుకుందంట. ఒకసారి గతంలోకి వెళితే.. 2008లో ఐపీఎల్ తొలి సీజన్ మొదలైంది.

అప్పట్లో వేలం ప్రక్రియ వేరుగా ఉండేది. సచిన్, సెహ్వాగ్, గంగూలీ వంటి సీనియర్ ఆటగాళ్లందరూ కూడా వేలంలో పాల్గొనడంతో.. ప్రతి జట్టు కేవలం ఇద్దరు అండర్ 19 ప్లేయర్లను మాత్రమే ఎంపిక చేసుకోవడానికి అనుమతి వుంది.

ఇక ఆ సమయంలో విరాట్ కోహ్లీని దక్కించుకునే సువర్ణావకాశం ఢిల్లీకి వచ్చింది. అయితే వారు విరాట్ స్థానంలో పేసర్ ప్రదీప్ సంగ్వాన్‌ను తీసుకున్నారు. దీనికి కారణం కూడా ఉంది.

అప్పట్లో ఢిల్లీ జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, ఏబీ డివిలియర్స్ వంటి ప్లేయర్స్ ఉండటంతో బౌలింగ్ దళాన్ని ఇంకా పదునెక్కించడానికి ఫ్రాంచైజీ మెంబర్స్ బౌలర్ల వైపు మొగ్గు చూపారు.

దీంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కోహ్లీని దక్కించుకుంది. గత 12 సీజన్లుగా ఆ జట్టు తరపునే ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లీ... ఒంటిచేత్తో విజయాలను అందిస్తూ వచ్చాడు. అయితే దురదృష్టవశాత్తూ ఐపీఎల్ ట్రోఫీని అందుకోలేకపోయాడు.