TATA IPL 2022: ఆదివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో తన మాజీ సహచర ఆటగాడు  పొలార్డ్ కు  లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ కృనాల్ పాండ్యా  ముద్దు పెట్టాడు.  ఆ ముద్దు వ్యవహారం ఇప్పుడు అతడికి కొత్త తంటాలు తెచ్చిపెట్టింది. 

గతంలో దీపక్ హుడా విషయంతో పాటు తన ప్రవర్తన కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కున్న లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ కృనాల్ పాండ్యా మరో వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా అతడు తన మాజీ సహచర ఆటగాడు.. కృనాల్ ముంబై ఇండియన్స్ లో ఉన్నప్పుడు సోదరుడిగా భావించిన కీరన్ పొలార్డ్ కు ముద్దు పెట్టడం చర్చనీయాంశమైంది. లక్నో-ముంబై మ్యాచ్ లో పొలార్డ్ ను ఔట్ చేశాక కృనాల్ అతడి మీదకు ఎగిరి.. తలపై కిస్ ఇచ్చాడు.

కృనాల్ చేసిన ఈ చర్య ఇప్పుడు అతడిని ఇరకాటంలో పడేసింది. పాండ్యా అలా చేసి ఉండకూడదని, ఇది పొలార్డ్ కు కూడా నచ్చలేదని, ఔట్ అయి పెవిలియన్ కు వెళ్లేప్పుడు అతడి ముఖంలో కూడా ఇది స్పష్టంగా కనిపించిందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. 

గవాస్కర్ మాట్లాడుతూ... ‘ఇది పనికిమాలిన చర్య. ఎవరూ హర్షించరు. పొలార్డ్ కు కూడా ఇది నచ్చదు. మీరు స్నేహితులైతే కావొచ్చు. కానీ అవన్నీ బౌండరీ ఆవలే. పాండ్యా ఇలా చేసి ఉండకూడదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

ఇదే విషయమై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. అసలే ఔట్ అయి తీవ్ర నిరాశలో ఉన్న పొలార్డ్ పై ఇలా చేయడం ఏమంత హర్షనీయం కాదని అంటున్నారు. ఔట్ అయి పెవిలియన్ కు వెళ్తున్నోడి దగ్గరకి వచ్చి పైకి ఎగరడమే గాక అతడికి కిస్ ఇవ్వడమనేది అగ్నికి ఆజ్యం పోయడం వంటిదే నని కామెంట్ చేస్తున్నారు. 

Scroll to load tweet…

లేకుంటే నా మెదడు తింటాడు : పాండ్యా 

పాండ్యా చేసిన పనికి సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై అతడు స్పందించాడు. ‘పొలార్డ్ ను ఔట్ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒకవేళ నేను గనక ఈ మ్యాచ్ లో అతడిని ఔట్ చేసి ఉండకుంటే జీవితాంతం అతడు నా బుర్ర తినేవాడు. ఎందుకంటే పొలార్డ్ బౌలింగ్ లోనే నేను ఔటయ్యాను. ఇక అతడు బ్యాటింగ్ కు వచ్చినప్పుడు అతడిని ఔట్ చేయకుంటే పొలార్డ్ నా మీద పైచేయి సాధించానని చెప్పుకునేవాడు. అందుకే ఔట్ చేసి లెక్క సరిచేశా..’ అని చెప్పుకొచ్చాడు. 

పాండ్యా సోదరులు చాలా కాలంగా పొలార్డ్ తో స్నేహబంధం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. 2015 నుంచి ముంబైకి ఆడుతున్న పాండ్యా బ్రదర్స్ తో పొలార్డ్ కూడా మంచి రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తాడు. తమ అనుబంధంపై హార్ధిక్ పాండ్యా ఓసారి మాట్లాడుతూ.. ‘మేము అతడిని తాత అని పిలుస్తాము. పొలార్డ్ వెస్టిండీస్ కు చెందినవాడైనా గుజరాతీ మనస్తత్వం ఉన్న వ్యక్తి. అతడు గుజరాతీ మాదిరే ఆలోచిస్తాడు. ఆస్తులు, పెట్టుబడుల మీద పొలార్డ్ ఎక్కువ ఖర్చు చేస్తాడు. కార్ కొంటే ఏమొస్తుంది. అదే ఒక ఆస్తి మీద పెట్టుబడి పెడితే అది తిరిగి డబుల్ అవుతుందనేది పొలార్డ్ మనస్తత్వం..’ అని పాండ్యా చెప్పాడు. 

ఇక లక్నోతో ముంబై మ్యాచ్ విషయానికొస్తే ఈ సీజన్ లో వరుసగా ఎనిమిదో పరాజయాన్ని నమోదు చేసింది రోహిత్ సేన.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై.. లక్నోను 168 పరుగులకే కట్టడి చేసింది. కెఎల్ రాహుల్ (103) సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం ముంబై. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మ (39) టాప్ స్కోరర్. 36 పరుగుల తేడాతో లక్నో విజయభేరి మోగించింది.