IPL 2022: ఐపీఎల్-15లో తన ఫాస్ట్ బౌలింగ్ తో అదరగొడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్  పేసర్ ఉమ్రాన్ మాలిక్ ను జాతీయ జట్టులోకి తీసుకోవాలని వాదనలు వినిపిస్తుండగా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశాడు. 

అత్యుత్తమ వేగంతో ఐపీఎల్-15 సీజన్ లో అదరగొడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ను ఇప్పుడే జాతీయ జట్టులోకి ఎంపిక చేయాల్సిన అవసరం లేదని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉమ్రాన్ చాలా చిన్నవాడని, ఇప్పుడే అతడిని జాతీయ జట్టులోకి తీసుకుని ఒకవేళ అక్కడ విఫలమైతే మళ్లీ అతడి కెరీర్ పాడవుతుందని.. అలాంటి అరుదైన బౌలర్ ను చాలా జాగ్రత్తగా వాడుకోవాలని సూచించాడు. గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన రెండో బంతిని విసిరిన ఉమ్రాన్ మాలిక్ ను జాతీయ జట్టులోకి తీసుకోవడం పై అతడి వ్యాఖ్యాలు ప్రసాద్ మాటల్లోనే... 

‘నా అభిప్రాయం ప్రకారం ఉమ్రాన్ మాలిక్ తాజా ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకని అతడిని జాతీయ జట్టులోకి తీసుకోకూడదు. ఒక పద్ధతి ప్రకారం తీసుకురావాలి. భారత్ లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడమనేది మామూలు విషయం కాదని నాకూ తెలుసు.. 

కానీ ఇప్పుడే అతడిని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకువస్తే.. ఒకవేళ అక్కడ ఉమ్రాన్ విఫలమైతే అది మొదటికే మోసం. జాతీయ జట్టులో అతడు రాణించకుంటే తిరిగి మళ్లీ అతడిని మనం అంతర్జాతీయ స్థాయిలో చూడటం కష్టమయ్యే ప్రమాదముంది. అలా కాకూడదంటే ముందుగా అతడిని దేశవాళీలో ఆడించాలి. ఒక సీజన్ పూర్తిగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడించి ఆ తర్వాత ఇండియా-ఎ కు ఎంపిక చేయాలి. ఓ నాలుగైదు సిరీస్ లకు పంపి ఆ తర్వాత జాతీయ జట్టుకు తీసుకోవాలి..’ అని తెలిపాడు. 

అంతేగాక.. ‘ఉమ్రాన్ ను ఒక పద్దతి ప్రకారం.. మహ్మద్ సిరాజ్ ను తీసుకొచ్చినట్టు జాతీయ జట్టులోకి ఎంపిక చేయాలి. సిరాజ్ నే చూడండి. అతడు గాలే టెస్టు (ఆస్ట్రేలియా) కు ముందు దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఇక్కడ 50 వికెట్లు కూడా తీశాడు. అత్యంత ఒత్తిడి ని సైతం తట్టుకుని ఆసీస్ పై అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత రెడ్ బాల్ క్రికెట్ (టెస్టు) లలో భారత్ కు రెగ్యులర్ బౌలర్ గా మారాడు. ఉమ్రాన్ ను కూడా అలాగే తయారుచేయాలి. విదేశాలలో జరిగే పలు ఇండియా-ఎ టూర్ లకు పంపి అక్కడ సానబెట్టాలి. ఆ తర్వాత జాతీయ జట్టులోకి తీసుకుంటే ఇక అతడికి తిరుగుండదు..’ అని ఎమ్మెస్కే అన్నాడు. 

ఉమ్రాన్ ఇలా ఎదగడానికి కారణమైన సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి కూడా ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపాడు. నిలకడగా 150 కిలోమీటర్ల కంటే వేగంతో బంతులు విసురుతున్న ఈ యువ బౌలర్ కు వరుసగా అవకాశాలినిస్తూ ఆ జట్టు అతడికి మద్దతుగా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు. ఉమ్రాన్ బౌలింగ్ ను చూసేకొద్దీ చూడముచ్చటగా ఉందని ప్రసాద్ కొనియాడాడు. 

ఇదిలాఉండగా.. ఉమ్రాన్ ప్రదర్శనలకు ఫిదా అయిన భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, హర్భజన్ సింగ్ వంటి ఆటగాళ్లు మాత్రం ఉమ్రాన్ ను వెంటనే భారత జట్టుకు ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తుండటం గమనార్హం. ఈ విషయంలో తాత్సారం చేయడం కూడా మంచిది కాదని వాళ్లు చెబుతున్నారు.