Tilak Varma: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న తెలుగు తేజం తిలక్ వర్మ త్వరలోనే టీమిండియా లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..? ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ ఆ మేరకు ఓ కీలక హింట్ కూడా ఇచ్చాడు.
ఆడుతున్నది తొలి సీజన్ అయినా నిలకడగా ఆడుతూ ఆకట్టుకునే ప్రదర్శనలు చేస్తున్న తిలక్ వర్మ త్వరలోనే భారత జట్టు తలుపు తట్టనున్నాడా..? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. తాజాగా టీమిండియా సారథి ఐపీఎల్ లో ముంబై కి కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ వ్యాఖ్యలు కూడా అదే సూచిస్తున్నాయి. గురువారం చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. తిలక్ వర్మ పై ప్రశంసలు కురిపించాడు. అతడు ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అని కీర్తించాడు.
సీఎస్కేతో మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘అతడు (తిలక్) బ్రిలియంట్ ప్లేయర్. ఆడుతున్నది తొలి సీజన్ అయినా నిలకడగా రాణించడమనేది సాధారణమైన విషయమేమీ కాదు. తిలక్ అతి త్వరలోనే భారత జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడబోయే ఆటగాడు అవుతాడు...
తిలక్ బ్యాటింగ్ టెక్నిక్, ఆడాలనే పట్టుదల, ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నాయి. అవే అతడిని ఉన్నతస్థాయిలో నిలబెడుతున్నాయి. అదీగాక పరుగులు సాధించాలనే ఆకలి మీద కూడా ఉన్నాడు. అదే అతడిని ఉన్నతస్థానంలో నిలబెడుతున్నది...’ అని ప్రశంసలు కురిపించాడు.
ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ టాపార్డర్ బ్యాటర్ల లో ఏ ఒక్క ఆటగాడు కూడా (తిలక్ మినహా) నిలకడగా రాణించలేదు. సుమారు రూ. 38 కోట్లు పెట్టి వెచ్చించిన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లు విఫలమయ్యారు. సూర్య అడపాదడపా రాణించినా అదీ అతడి స్థాయికి తగ్గ ప్రదర్శనైతే కాదు. కానీ తిలక్ మాత్రం టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్ లో 12 మ్యాచులాడిన తిలక్.. 368 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ముంబై జట్టులో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు అతడే కావడం విశేషం. ముంబై విజయాలతో పాటు కీలక సమయంలో క్రీజులో నిలబడి.. ఆ జట్టును భారీ ఓటముల నుంచి కూడా తప్పించాడు.
తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో సీఎస్కే నిర్దేశించిన 98 పరుగుల ఛేదనలో ముంబై.. 33 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో బ్యాటింగ్ కు వచ్చిన అతడు.. 32 బంతుల్లో 34 పరుగులు చేసి తన జట్టుకు సీజన్ లో మూడో విజయం అందించాడు.
