Asianet News TeluguAsianet News Telugu

ఆస్ట్రేలియాతో సెమీస్‌కి ముందు టీమిండియా షాక్... కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌తో పాటు పూజాకి అస్వస్థత...

సెమీ ఫైనల్‌కి ముందు అనారోగ్యానికి గురైన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్... ఆస్ట్రేలియాతో సెమీస్‌కి కెప్టెన్‌గా స్మృతి మంధాన..

Harmanpreet Kaur, Pooja Vastrakar are unlikely to play the semi-final clash against Australia t20wc cra
Author
First Published Feb 23, 2023, 1:37 PM IST

ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీలో సెమీ ఫైనల్‌కి అర్హత సాధించిన భారత జట్టు, నేడు గ్రూప్ ఏ టేబుల్ టాపర్ ఆస్ట్రేలియాతో తలబడనుంది. 2020 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో చిత్తుగా ఓడిన భారత జట్టు, ఈసారి సెమీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది...

అయితే ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌కి ముందు టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఇద్దరూ అనారోగ్యానికి గురి కావడంతో ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.. హర్మన్‌ప్రీత్ కౌర్ అనారోగ్యం నుంచి కోలుకోకపోతే వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, సెమీస్‌లో టీమిండియాకి కెప్టెన్సీ చేసే అవకాశాలు ఉన్నాయి.. 

ఈ ఇద్దరితో పాటు భారత స్పిన్నర్ రాధా యాదవ్ కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. రాధా యాదవ్, సెమీ ఫైనల్ సమయానికి టీమ్‌తో కలుస్తుందా? అనేది కూడా అనుమానమే. రాధా యాదవ్‌కి ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది. తను కూడా దూరమైతే ఆస్ట్రేలియా మరింత పటిష్టంగా చెలరేగిపోవడం ఖాయం...

ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో 87 పరుగులు చేసిన స్మృతి మంధాన, ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉంది.  ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 బంతులు ఆడిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 13 పరుగులు మాత్రమే చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా లేదు..

అయితే ఐర్లాండ్‌తో మ్యాచ్‌కి ముందే హర్మన్‌ప్రీత్ కౌర్ అనారోగ్యానికి గురైందని, అయితే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో అలాగే బరిలో దిగిందని సమాచారం. సెమీ ఫైనల్‌కి ముందు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రాక్టీస్ సెషన్లలోనూ పాల్గొనలేదు. అయితే పరిస్థితి తీవ్రం కావడంతో హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుంటోంది.

అలాగే ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ కూడా జ్వరంతో బాధపడుతోంది. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం కావడంతో టీమిండియా సెమీ ఫైనల్‌లో పటిష్ట ఆస్ట్రేలియాని అడ్డుకోగలదా? అనే అనుమానాలు రేగుతున్నాయి.

టీమిండియాపై ఆస్ట్రేలియాకి ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఇరుజట్ల మధ్య 30 మ్యాచులు జరగగా 22 మ్యాచుల్లో ఆస్ట్రేలియానే గెలిచింది. 7 మ్యాచుల్లో భారత జట్టు గెలిచింది. ఓ మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయ్యింది..

2022 డిసెంబర్‌లో ఇండయాలో పర్యటించిన ఆస్ట్రేలియా జట్టు, ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ని 4-1 తేడాతో కోల్పోయింది. అంతకుముందు కామన్వెల్త్ గేమ్స్‌ 2022లోనూ ఆస్ట్రేలియా మహిళా జట్టు, టీమిండియాపై రెండు మ్యాచుల్లోనూ గెలిచింది.. గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టును ఓడించిన ఆస్ట్రేలియా, ఫైనల్ మ్యాచ్‌లోనూ ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది.. 

Follow Us:
Download App:
  • android
  • ios