Asianet News TeluguAsianet News Telugu

Jhulan Goswami: జులన్‌కు క్లీన్ స్వీప్‌ కానుకనిచ్చిన టీమిండియా.. చివరి వన్డేలోనూ ఇంగ్లాండ్ చిత్తు

INDW vs ENGW: టీమిండియా మహిళా క్రికెట్ దిగ్గజం జులన్ గోస్వామి తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ను విజయంతో ముగించింది. లార్డ్స్ లో టీమిండియా.. జులన్ కు క్లీన్ స్వీప్ కానుకనిచ్చింది. 

Harmanpreet Kaur Led Team India Beat England by 16 Runs, Clinch Series By 3-0
Author
First Published Sep 25, 2022, 11:06 AM IST

రెండు దశాబ్దాల పాటు భారత మహిళా క్రికెట్‌కు చిరునామాగా నిలిచిన  వెటరన్ పేసర్ జులన్ గోస్వామి తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ను విజయంతో ముగించింది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. క్రికెట్ మక్కా లార్డ్స్ లో జరిగిన మూడో వన్డేలో విక్టరీ కొట్టి  బ్రిటీష్ జట్టును 0-3తో ఓడించి జులన్ గోస్వామికి ‘క్లీన్ స్వీప్’ కానుకనిచ్చింది. లోస్కోరింగ్ గేమ్ గా ముగిసిన ఈ మ్యాచ్ లో భారత్.. తొలుత బ్యాటింగ్ చేసి 45.4 ఓవర్లలో 169 పరుగులే చేయగా స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ తడబడింది. 43.3 ఓవర్లలో ఇంగ్లాండ్ అమ్మాయిలు 153 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా భారత్.. 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ఈ సిరీస్ లో  ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలుచుకుని సిరీస్  నెగ్గిన భారత్.. నామమాత్రమే అయినా మూడో వన్డేను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  20 ఏండ్లుగా భారత మహిళా క్రికెట్ జట్టు బౌలింగ్ దళానికి కర్త, కర్మ, క్రియ అయి నడిపిస్తున్న జులన్ గోస్వామికి ఇదే చివరి మ్యాచ్ కావడంతో  బ్యాటింగ్ లో విఫలమైనా బౌలింగ్ లో సత్తా చాటి ఇంగ్లాండ్ కు చుక్కలు చూపెట్టింది.  మూడో వన్డేలో కూడా గెలిచి  జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలునిచ్చింది. 

ఈ మ్యాచ్ లో  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా తడబడింది. ఇంగ్లాండ్  బౌలర్ కేట్ క్రాస్ (4-26) విజృంభణతో షఫాలీ వర్మ (0), యశ్తిక భాటియా (0), హర్మన్ ప్రీత్ కౌర్ (4)లు  అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. హర్లీన్ డియోల్ (3) ను డెవిస్ ఎల్బీగా వెనక్కి పంపింది. దీంతో భారత్ 8 ఓవర్లలో 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 

కానీ స్మృతి మంధాన (50), దీప్తి శర్మ (69) లు పట్టుదలగా ఆడి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసుకున్నారు. హాఫ్ సెంచరీ ముగిశాక మంధాన ఔటైనా దీప్తి మాత్రం చివరి వరుస బ్యాటర్లతో నాటౌట్ గా నిలిచింది. ఐదుగురు టీమిండియా బ్యాటర్లు డకౌట్ కావడం గమనార్హం. చివరి మ్యాచ్ ఆడుతున్న జులన్ గోస్వామి (0) కూడా నిరాశపరిచింది. 

 

స్వల్ప  లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ కూ కష్టాలు తప్పలేదు. టీమిండియా యువ  పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ (4-29) తన స్వింగ్ తో  ప్రత్యర్థి పని పట్టింది. ఓపెనర్ టామీ బ్యూమంట్ (8) తో పాటు ఎమ్మా లంబ్ (21), సోఫియా (7) లను ఔట్ చేసి ఇంగ్లాండ్ ను దెబ్బతీసింది. ఇక జులన్ గోస్వామి కూడా అలీస్ క్యాప్సీ (5), వ్యాట్ (8) లను ఔట్ చేసింది. తన చివరి మ్యాచ్  లో జులన్.. 10 ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసింది.  చివర్లో  చార్లీ డీన్ (47) పోరాడింది. లోయరార్డర్ బ్యాటర్లతో కలిసి ఇంగ్లాండ్ ను విజయం వైపు నడిపించింది. కానీ 44 వ ఓవర్ వేసిన దీప్తి శర్మ.. చార్లీ డీన్ ను రనౌట్ (మన్కడింగ్ రూపంలో) ఔట్ చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కు తెరదించింది. ఈ ఔట్ వివాదాస్పదమైనప్పటికీ అప్పటికే దీప్తి బౌలింగ్ యాక్షన్ పూర్తి చేయడంతో అంపైర్ దానిని ఔట్ గా ప్రకటించాడు. దీంతో ఇంగ్లాండ్ 153 పరుగల వద్ద ఆలౌటైంది. 

 

ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసుకున్న రేణుకా సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. సిరీస్ లో రాణించిన హర్మన్ ప్రీత్ కౌర్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. 

Follow Us:
Download App:
  • android
  • ios