Asianet News TeluguAsianet News Telugu

ఒకటి నీకు, ఒకటి నాకు..! నాలుగో టీ20లో పాక్‌దే గెలుపు.. ఆసక్తికరంగా పాకిస్తాన్-ఇంగ్లాండ్ సిరీస్

PAK vs ENG T20I: పాకిస్తాన్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న  టీ20 సిరీస్ ఆసక్తికరంగా సాగుతున్నది. ఏడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇప్పటికి నాలుగు టీ20లు ముగియగా ప్రతీ మ్యాచ్ కు విజేతలు మారుతున్నారు. 

Haris Rauf, Mohammed Rizwan Stars As Pakistan Beat England in 4th T20I
Author
First Published Sep 26, 2022, 11:10 AM IST

సుదీర్ఘ విరామం తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్ తో ఆడుతున్న పాకిస్తాన్ చిత్ర విచిత్రమైన ఆట ఆడుతున్నది. ఓ మ్యాచ్ లో రెచ్చిపోతే మరో మ్యాచ్ లో పేలవంగా ఆడి ఓడుతున్నది.  ఒక మ్యాచ్ లో  వీరబాదుడు బాదిన బ్యాటర్ మరో మ్యాచ్ లో విఫలమవుతున్నాడు. బౌలర్లు కూడా అంతే.. ఒక మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలర్లను వణికించే బౌలర్.. తర్వాత మ్యాచ్ లో  ధారాళంగా పరుగులిస్తున్నాడు. ఇందుకు ఇంగ్లాండ్ ఏమైనా మినహాయింపా అంటే అదీ లేదు. దొందూ దొందే. ఏడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా కరాచీలో  ఆదివారం ముగిసిన నాలుగో వన్డేలో పాకిస్తాన్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 

ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య నాలుగు టీ20లు ముగిశాయి. తొలి టీ20లో ఇంగ్లాండ్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ పుంజుకుని రెండు వందల లక్ష్యాన్ని అవలీలగా ఊదిపారేసింది. మళ్లీ మూడో మ్యాచ్ లో ఇంగ్లాండ్ వీరబాదుడు బాది  గెలుపు బాట పట్టింది. కానీ నిన్న ముగిసిన నాలుగో టీ20లో లో స్కోరింగ్ థ్రిల్లర్ లో తల వంచింది.  

కరాచీ వేదికగా ముగిసిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులే చేసింది.  టీ20లలో ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (67 బంతుల్లో 88, 9 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి రెచ్చిపోగా కెప్టెన్ బాబర్ ఆజమ్ (36) ఫర్వాలేదనిపించాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 97 పరుగులు జోడించారు. కానీ పాకిస్తాన్ మిడిలార్డర్ మరోసారి విఫలమైంది.  ఈ ఇద్దరి తర్వాత  షాన్ మసూద్ (21) తప్ప మిగతావాళ్లు విఫలమయ్యారు. 

అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్..  ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (8), అలెక్స్ హేల్స్ (5), విల్ జాక్స్ (0) వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. 14 పరుగులకే ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ క్రమంలో  బెన్ డకెట్ (33), హ్యారీ బ్రూక్ (34) ఇంగ్లాండ్ ను ఆదుకున్నారు. కానీ డకెట్ ను నవాజ్ ఎల్బీగా వెనక్కిపంపాడు. కెప్టెన్ మోయిన్ అలీ (29) కూడా ఎక్కువసేపు నిలవలేదు.  కానీ చివర్లో లియామ్ డాసన్ (17 బంతుల్లో 34) మెరుపులు మెరిపించి ఇంగ్లాండ్ ను విజయానికి దగ్గర చేశాడు. అప్పటికీ ఇంగ్లాండ్ స్కోరు 19 ఓవర్లకు 163-9. చివరి ఓవర్లో 3 పరుగులు చేస్తే విజయం వాళ్లదే. కానీ మహ్మద్ వసీం వేసిన 20వ ఓవర్లో తొలి బంతికి పరుగులేమీ రాలేదు. రెండో బంతికి టాప్లీ రనౌట్ అయ్యాడు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్, మహ్మద్ నవాజ్ లు తలా మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. 

 

3 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలవడంతో ఏడు మ్యాచ్ ల సిరీస్ 2-2తో సమమైంది. ఈ సిరీస్ లో తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 28న లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరుగుతుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios