Asianet News TeluguAsianet News Telugu

IPL: పంతం నెగ్గించుకున్న రషీద్ ఖాన్.. ఆ ఫ్రాంచైజీకి మాస్టర్ స్ట్రోక్.. అహ్మదాబాద్ రిటైన్ ప్లేయర్లు వీళ్లే..

IPL Auction 2022: అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మొత్తానికి తన పంతం నెగ్గించుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ లో పోయిన ‘మొత్తాన్ని’  అహ్మదాబాద్ లో వెతుక్కున్నాడు. ఇన్నాళ్లు అతడు తమవైపే ఉన్నాడని నమ్మిన కొత్త ఫ్రాంచైజీకి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు. 
 

Hardik Pandya, Rashid Khan and Shubman Gill set to join Ahmedabad franchise for IPL 2022, Reports
Author
Hyderabad, First Published Jan 18, 2022, 3:20 PM IST

ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్, ఐపీఎల్ లో మొన్నటిదాకా సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన  రషీద్ ఖాన్ పంతం నెగ్గించుకున్నాడు. ఐపీఎల్ లో తనకున్న డిమాండ్ ను క్యాష్ చేసుకున్నాడు. వచ్చే ఐపీఎల్ లో అతడు.. లక్నో తరఫున ఆడటం ఖాయమనుకున్నవాళ్లకు షాకిచ్చాడు. సన్ రైజర్స్ నుంచి తప్పుకున్నాక  రషీద్ ఖాన్.. ఐపీఎల్ లో కొత్తగా చేరిన లక్నో ఫ్రాంచైజీ తరఫున ఆడతాడని ప్రచారం జరిగింది. ఎస్ఆర్హెచ్ లో తనను నెంబర్ వన్ ప్లేయర్ (అత్యధిక ధర పొందేందుకు గాను) గా తనను గుర్తించాలని పట్టుబట్టి..  యాజమాన్యం అలా చేయకపోవడంతో ఆ జట్టు నుంచి వైదొలిగిన అతడు లక్నో తరఫున ఆడేందుకు భారీగా డిమాండ్ చేశాడు. తనకు రూ. 15 కోట్ల దాకా ఇవ్వాలని అడిగినట్టు గతంలో వార్తలు వచ్చాయి. 

అయితే లక్నో యాజమాన్యం.. దీనిపై రాహుల్, రషీద్ తో చర్చలు జరుపుతున్న సమయంలో అహ్మదాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్స్..  లక్నోకు షాకిచ్చింది.  రషీద్ డిమాండ్ చేసినంత ధరను అతడికి చెల్లించేందుకు సీవీసీ అంగీకరించింది. రషీద్ ఖాన్ కు రూ. 15 కోట్లు చెల్లించనున్న సీవీసీ.. ఆ జట్టు సారథిగా భావిస్తున్న హార్ధిక్ పాండ్యాకు కూడా అంతే అందించనుంది.  ఈ మేరకు సీవీసీ యాజమాన్యం..  పాండ్యాను ఒప్పించింది. 

తాజా నివేదికల ప్రకారం.. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది) కు రూ. 15 కోట్లు,  రషీద్ ఖాన్ కు రూ. 15 కోట్లు చెల్లించనున్న సీవీసీ.. కోల్కతా  నైట్ రైడర్స్ మాజీ ఓపెనర్  శుభమన్ గిల్ కు రూ. 7 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. 

ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఒక ఫ్రాంచైజీ వేలంలో రూ. 90 కోట్ల దాకా ఖర్చు చేసి ఆటగాళ్లను దక్కించుకునే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే అహ్మాదాబాద్ ఇప్పటికే  హార్ధిక్, రషీద్ ఖాన్, శుభమన్ గిల్ ల మీద రూ. 37 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా ఆ  ఫ్రాంచైజీ ఖాతాలో రూ. 53 కోట్లు ఉంటాయి.   మిగిలిన జట్టును ఈ అమౌంట్ లోనే సర్దాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే.   
 
గతం కంటే ఎంత ఎక్కువ..? 

శుభమన్ గిల్ మినహా రషీద్ ఖాన్, హార్ధిక్ పాండ్యాలు ఇద్దరూ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవాళ్లే.. 2015లో ముంబై ఇండియన్స్ తరఫున రూ. 10 లక్షల సాధారణ ధరతో వచ్చిన పాండ్యా.. ఆ తర్వాత ముంబైలో కీలక ఆటగాడిగా మారాడు. గత ఐపీఎల్ లో ముంబై అతడి కోసం వెచ్చించిన మొత్తం రూ. 11 కోట్లు. ఇక ఇప్పుడు అహ్మదాబాద్ పాండ్యాకు చెల్లించబోతున్న మొత్తం రూ. 15 కోట్లు. ముంబై అతడిని రిటెన్షన్ లో వదిలేసినా పాండ్యాకు మంచే జరిగింది. ఇక ఐపీఎల్ లో ముంబై తరఫున 92 మ్యాచులు ఆడిన పాండ్యా.. బ్యాటింగ్ లో 1,476 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 42 వికెట్లు తీశాడు. 

రషీద్ ఖాన్ విషయానికొస్తే.. గత సీజన్ లో  ఎస్ఆర్హెచ్ అతడిని రూ. 11 కోట్లతో  దక్కించుకుంది. ఐపీఎల్ లో 76 మ్యాచులు ఆడిన  రషీద్.. 92 వికెట్లు తీశాడు. గతంతో పోలిస్తే రషీద్ కు రూ. 4 కోట్లు అదనంగా దక్కినట్టే. ఇక గతేడాది  కేకేఆర్ శుభమన్ గిల్ ను రూ. 1.8 కోట్లకు  దక్కించుకుంది. కానీ ఈసారి అతడు జాక్ పాట్ కొట్టాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios