Asianet News TeluguAsianet News Telugu

బౌలర్లు మెరిసినా, భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా... టీమిండియా బ్యాటర్ల ముందు...

చెన్నై వన్డే: 49 ఓవర్లలో 269 పరుగులకి ఆస్ట్రేలియా ఆలౌట్... 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన మిచెల్ మార్ష్... మూడేసి వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్.. 

Hardik Pandya, Kuldeep Yadav picks 3, Team India scored huge target in chennai OdI series decider cra
Author
First Published Mar 22, 2023, 5:39 PM IST

చెన్నై వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మిచెల్ మార్ష్ 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఎవ్వరూ హాఫ్ సెంచరీ మార్కు దాటకపోయినా స్టీవ్ స్మిత్ మినహా మిగిలిన 10 బ్యాటర్లు డబుల్ డిజిట్ స్కోరు చేసి మూకుమ్మడిగా రాణించారు.. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకి ఓపెనర్లు శుభారంభం అందించారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కి తుది జట్టులో చోటు దక్కినా బీభత్సమైన ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చాడు ట్రావిస్ హెడ్...

ఓపెనర్లు ఇద్దరూ దూకుడుగా ఆడడంతో తొలి పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. అయితే 11వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన హార్ధిక్ పాండ్యా, టీమిండియాకి తొలి బ్రేక్ అందించాడు. 

31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా స్ట్రైయిక్ క్యాచ్ డ్రాప్ చేయడంతో రెండు బంతుల ముందే లైఫ్ దక్కినా, దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు ట్రావిస్ హెడ్...

ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, 3 బంతులాడి డకౌట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు స్టీవ్ స్మిత్. వన్డే ఫార్మాట్‌లో స్టీవ్ స్మిత్ ఆరేళ్ల తర్వాత డకౌట్ అయ్యాడు. వన్డేల్లో స్టీవ్ స్మిత్‌ని అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్‌గా రెండో స్థానంలో నిలిచాడు హార్ధిక్ పాండ్యా...


గత రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన మిచెల్ మార్ష్, మూడో వన్డేలోనూ అదే దూకుడు కొనసాగించాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసిన మిచెల్ మార్ష్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

8 ఏళ్ల తర్వాత మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన డేవిడ్ వార్నర్ 31 బంతుల్లో ఓ ఫోర్‌తో 23 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 45 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్ కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు..

138 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. ఈ దశలో స్టోయినిస్, అలెక్స్ క్యారీ కలిసి ఆరో వికెట్‌కి 58 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 26 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 46 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. 

23 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన సీన్ అబ్బాట్‌ని అక్షర్ పటేల్ బౌల్డ్ చేయగా 21 బంతుల్లో ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన అస్టన్ అగర్, సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 247 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా ఆఖరి వికెట్‌కి 22 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆస్ట్రేలియా పరుగుల మార్కును దాటింది..

భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, హార్ధిక్ పాండ్యా 3 వికెట్లు తీయగా అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్‌కి ఓ వికెట్ దక్కింది. 

Follow Us:
Download App:
  • android
  • ios