అంటిగ్వా: భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై వెస్టిండీస్ ఆల్ రౌండర్ పోలార్డ్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియాలో అతను సూపర్ స్టార్ గా ఎదిగాడని ఆయన అన్నాడు. భారత క్రికెట్ జట్టులో స్థానం కోసం పడిన కష్టమే హార్డిక్ పాండ్యాను సూపర్ స్టార్ గా నిలిపిందని అన్నాడు. 

ప్రస్తుతం టీమిండియాలో హార్డిక్ పాండ్యా స్టార్ క్రికెటర్ అనడానికి సందేహించాల్సిన అవసరం లేదని పోలార్డ్ అన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు తాను ఆడడం ప్రారంభించినప్పటి నుంచి హార్డిక్ పాండ్యాను గమనిస్తున్నానని, తానేమిటో నిరూపించుకోవడానికి పాండ్యా ఎప్పుడూ తపించిపోయాడని ఆయన అన్నాడు. 

అదేమీ తనను ఆశ్చర్యపరచలేదని, ఐపిఎల్ లో తన సత్తాను చాటిన హార్డిక్ ప్రస్తుతం టీమిండియాలో కీలకంగా మారిపోయాడని, భారత్ కు లభించిన కచ్చితమైన ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యా అని ఆయన అన్నాడు. వ్యక్తిగతంగా పాండ్యాతో తనకు మంచి స్నేహం ఉందని అన్నాడు. 

ఇద్దరం తమ తప్పులను సరిదిద్దుకోవడానికి చర్చించుకునేవాళ్లమని పోలార్డ్ చెప్పాడు. ఆఫ్ ఫీల్డ్ లో నమ్మకంగా ఉన్నప్పుడు ఆన్ ఫీల్డ్ లో కూడా మన ప్రదర్శన బయటకు వస్తుందని అన్నాడు. అది ఉన్నత స్థానంలో నిలుపుతుందని అన్నాడు. ఆత్మవిశ్వాసం కలిగిన క్రికెటర్లలో హార్డిక్ ఒక్కడని, చాలా తక్కువ సమయంలో ఎదిగాడని, కష్టించే తత్వమే అతన్ని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లిందని పోలార్డ్ అన్నాడు.