Harbhajan Sreesanth Slapgate Video: ఐపీఎల్ 2008లో హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య జరిగిన 'స్లాప్‌గేట్' ఘటన వీడియో 17 ఏళ్ల తర్వాత బయటకొచ్చింది. లలిత్ మోడీ ఈ వీడియోని విడుదల చేశారు.
KNOW
Harbhajan Sreesanth Slapgate Video:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచ స్థాయి క్రీడా వేదికగా ఎదిగినా, 2008 నాటి ఓ సంఘటనను 17 ఏళ్ల పాటు దాచిపెట్టారు. 2008లో ముంబై ఇండియన్స్, కింగ్స్ XI పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్భజన్ సింగ్.. శ్రీశాంత్ పై చేయి చేసుకున్నారు. ఇప్పుడు ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ అధ్యక్షుడు లలిత్ మోడీ ఈ ఘటన వీడియోని బయటపెట్టారు.
వీడియో ఇన్నాళ్లకు ఎందుకు?
ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన హర్షా భోగ్లే కూడా ఇన్నాళ్లు నోరువిప్పలేదు. కానీ 17 ఏళ్ల తర్వాత ఈ వీడియో బయటపడటం వెనుక కారణాలేంటో చెప్పారు. లలిత్ మోడీ వీడియో విడుదల చేసిన తర్వాత హర్షా భోగ్లే మాట్లాడుతూ.. 'చాలా కొద్దిమంది మాత్రమే ఈ ఘటన చూశారు. కానీ ఈ విషయం బయటకు పొక్కకూడదని అనుకున్నాం. అందుకే మేం ఈ విషయం గురించి మాట్లాడలేదు. ఐపీఎల్ మొదలైన కొత్తలో జరిగిన ఘటన. ఈ వివాదం ఐపీఎల్‌కి మంచిది కాదని భావించాం' అని అన్నారు.
హర్భజన్ ఏం చెప్పారంటే?
ఐపీఎల్ చరిత్రలో ఇది మర్చిపోలేని ఘటన. 17 ఏళ్ల తర్వాత ఈ వీడియో చూడటం ఆశ్చర్యంగానే ఉంది. హర్భజన్ తన తప్పుకి జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. హర్భజన్ ఓ ఇంటర్వ్యూలో, 'శ్రీశాంత్ కూతురు నన్ను చూడటానికి ఇష్టపడటం లేదు. నేను ఆమె నాన్నని కొట్టానని ఆమెకి కోపం. నాకూ ఇప్పటికీ బాధగానే ఉంది' అని చెప్పారు.
ఐపీఎల్ బ్రాండ్ ఇమేజ్ ముఖ్యమా?
హర్షా భోగ్లే పోస్ట్‌కి కామెంట్ చేసిన చాలామంది.. 'అభిమానులకు నిజం చెప్పడం కంటే ఐపీఎల్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవడం మీకు ముఖ్యమైందా? ఇంకా ఎన్ని విషయాలు దాస్తున్నారో?' అని ప్రశ్నించారు.
'ఈ వీడియో బయటపెట్టకూడదు. శ్రీశాంత్ కూతురు తనని ద్వేషిస్తుందని హర్భజన్ చెప్పాడు. హర్భజన్ చాలాసార్లు క్షమాపణ చెప్పాడు. ఇలాంటి బాధాకరమైన విషయాలు బయటపెట్టకూడదు' అని ఇంకొకరు రాశారు.
మీకు సిగ్గుండాలి.. లలిత్ మోడీ పై శ్రీశాంత్ భార్య ఫైర్
లలిత్ మోడీ 2008 IPLలో జరిగిన 'స్లాప్‌గేట్' ఘటనకు సంబంధించిన అప్పటి వరకు ఎవరూ చూడని ఫుటేజ్‌ను మైఖేల్ క్లార్క్ యూట్యూబ్ పాడ్‌కాస్ట్ 'బియాండ్23 క్రికెట్'లో విడుదల చేశారు. హర్భజన్ సింగ్, శ్రీశాంత్‌ల మధ్య జరిగిన ఈ సంఘటనపై, శ్రీశాంత్ భార్య భువనేశ్వరి శ్రీశాంత్ ఘాటుగా స్పందించారు. ఈ వీడియోను అప్‌లోడ్ చేయడం అమానుషమైన చర్య అని ఆమె వ్యాఖ్యానించారు.
తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో.. "మీకు సిగ్గుండాలి @Lalitkmodi, @Michaelclarkeofficial. మీ స్వంత ప్రచారం, వ్యూస్ కోసం 2008 నాటి సంఘటనను మళ్లీ బయటకు తీయడానికి మీరు మనుషులు కూడా కాదు. @Sreesanthnair.36, హర్భజన్ ఇద్దరూ చాలా కాలం క్రితమే ఆ ఘటనను మర్చిపోయారు. ఇప్పుడు వారు పిల్లలు ఉన్న తండ్రులు, అయినా మీరు పాత గాయాన్ని మళ్ళీ రేపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా అసహ్యంగా, నిర్దాక్షిణ్యంగా, అమానుషంగా ఉంది" అని భువనేశ్వరి పేర్కొన్నారు.
