డీఆర్‌ఎస్ వల్లే పాకిస్తాన్ ఓడిపోయిందన్న హర్భజన్ సింగ్! మరి మావాడి పరిస్థితి ఏంటన్న గ్రేమ్ స్మిత్...
సౌతాఫ్రికా ఆఖరి బ్యాటర్ తబ్రేజ్ షంసీని కాపాడిన అంపైర్స్ కాల్... బ్యాడ్ అంపైరింగ్ వల్లే పాకిస్తాన్ ఓడిపోయిందంటూ హర్భజన్ సింగ్ ట్వీట్... మాక్కూడా నష్టం జరిగిందన్న గ్రేమ్ స్మిత్..
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి రెండు మ్యాచుల్లో గెలిచిన పాకిస్తాన్, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో పరాజయం పాలైంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 270 పరుగులు చేసిన పాకిస్తాన్, ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది..
సౌతాఫ్రికా విజయానికి 35 పరుగులు కావాల్సిన సమయంలో పాకిస్తాన్ బౌలర్లు వెంటవెంటనే 4 వికెట్లు తీయడంతో ఉత్కంఠ రేగింది. అయితే ఆఖర్లో కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షంసీ కలిసి చివరి వికెట్‌కి 11 పరుగులు జోడించి సౌతాఫ్రికాకి థ్రిల్లింగ్ విక్టరీ అందించారు..
11వ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చిన తబ్రేజ్ షంసీ, హరీస్ రౌఫ్ వేసిన ఆఖరి బంతిని ఆడలేకపోయాడు. షంసీ కాలికి బంతి తగలగానే హారీస్ రౌఫ్ అప్పీలు చేయడం, అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో డీఆర్‌ఎస్ కోరుకోవడం జరిగిపోయాయి. టీవీ రిప్లైలో అంపైర్స్ కాల్‌గా తేలడంతో ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నాటౌట్ నిర్ణయమే ఫైనల్ అన్నట్టు థర్డ్ అంపైర్ ప్రకటించాడు.
అది అవుట్‌గా ప్రకటించి ఉంటే, పాకిస్తాన్ 10 పరుగుల తేడాతో గెలిచి ఉండేది. దీనిపై హర్భజన్ సింగ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
‘బ్యాడ్ అంపైరింగ్, బ్యాడ్ రూల్స్ కారణంగా పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఓడిపోయింది. ఐసీసీ అంపైర్స్ కాల్స్ రూల్‌ని మారిస్తే బెటర్. బంతి స్టంప్స్‌కి తగిలితే అది అవుట్ కిందే పరిగణించాలి. ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా దాన్ని లెక్కలోకి తీసుకోకూడదు. ఇంత టెక్నాలజీ వాడడం వల్ల ఉపయోగం ఏంటి?’ అంటూ ట్వీట్ చేశాడు హర్భజన్ సింగ్..
ఈ ట్వీట్‌పై సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ స్పందించాడు. ఇదే మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ రస్సీ వాన్ దేర్ దుస్సేన్ కూడా ఇదే విధంగా అవుట్ అయ్యాడు. ఉసామా మిర్ బౌలింగ్‌లో దుస్సేన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయినట్టు ఫీల్డ్ అంపైర్ ప్రకటించాడు. టీవీ రిప్లైలో అంపైర్స్ కాల్‌గా రావడంతో దుస్సేన్ నిరాశగా పెవిలియన్ చేరాడు..
‘భజ్జీ.. అంపైర్స్ కాల్‌పైన నా అభిప్రాయం కూడా ఇదే. రస్సీ వాన్ దుస్సేన్, సౌతాఫ్రికాకి కూడా దీని వల్ల నష్టం జరిగింది’ ’ అంటూ రిప్లై ఇచ్చాడు. హర్భజన్ సింగ్ ఈ వాదనను కొనసాగించాడు..
‘ఇది కరెక్ట్ కాదు. అంపైర్స్ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలా? లేక టెక్నాలజీ వాడాలా? అనే విషయంపై ఓ నిర్ణయం తీసుకోవాలి. బాల్ ట్రాకింగ్‌లో వికెట్లను తగలుతున్నట్టు రెండు సార్లు కనిపించింది. ఓ సారి అవుట్ ఇస్తే, మరోసారి నాటౌట్ ఇచ్చారు. దీని వల్ల క్రికెట్ ప్రపంచానికి ఏం చెబుతున్నారు? అంపైర్‌ది తప్పా? లేక టెక్నాలజీది తప్పా? ఇద్దరిలో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలో తేల్చాల్సిన సమయం వచ్చింది..’ అంటూ ట్వీట్ చేశాడు హర్భజన్ సింగ్..