దేశంలో కరోనా సెకండ్ వేవ్ వల్ల తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. లాక్‌డౌన్ విధించినప్పటికీ కన్నడ గడ్డ మీద కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడంతో పాటుగా వందలాది మరణాలు సంభవిస్తున్నాయి.

గత 24 గంటల వ్యవధిలో అక్కడ 25 వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా... 529 మంది కోవిడ్‌తో మరణించారు. అయితే, రాజధాని బెంగళూరులో తొలుత భారీ ఎత్తున కేసులు నమోదు కాగా, లాక్‌డౌన్‌ తర్వాత నెమ్మదించాయి. సోమవారం అక్కడ కొత్తగా 5701 కేసులు నమోదయ్యాయి.

ఇదిలా ఉండగా.. బెంగళూరులో ఓ వ్యక్తికి బలవంతంగా కోవిడ్‌ టెస్టు చేయిస్తున్న దృశ్యాలు అంటూ ఓ నెటిజన్‌ షేర్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ యువకుడిని బలవంతంగా లాక్కొచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడిని కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలంటూ తీవ్రంగా కొట్టారు. అటుగా వెళ్తున్న బాటసారులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. 

Also Read:ఓడితే విరాట్ కెప్టెన్సీని తిడతారు, గెలిస్తే కేన్ విలియంసన్‌పై సానుభూతి చూపిస్తారు... ఎలాచూసినా కోహ్లీకి...

ఇక ఈ వీడియోపై స్పందించారు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌. టెస్టు చేయించుకోమని ఎందుకు అతడిని కొడుతున్నారు.. సిగ్గులేదా అంటూ మండిపడ్డారు. వైరస్‌పై పోరాడటం ఇలా కాదు... ఇదిచాలా తప్పు అని భజ్జీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అయితే, ఓ నెటిజన్‌ దీనికి స్పందిస్తూ.. సదరు బాధితుడికి గతంలో పాజిటివ్‌ వచ్చిందని... అయినప్పటికీ బయట తిరుగుతున్నాడని చెప్పాడు. అక్కడితో ఆగకుండా అతడిపై ఫిర్యాదు చేసిన వారిపై ఉమ్మివేశాడని.. అందుకే ఇలా మరోసారి టెస్టుకు తీసుకువచ్చారని ఈ సందర్భంగా రిజల్ట్ మళ్లీ పాజిటివ్‌ వచ్చిందని వెల్లడించాడు. దీనికి సంబంధించి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని.. మనం చూసేదంతా నిజం అనుకోవద్దు అని వివరణ ఇచ్చాడు.