నూతన సంవత్సరంలో తొలిసారిగా... శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడటానికి టీమిండియా క్రికెటర్లు సిద్ధమయ్యారు. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగాల్సి ఉండగా... వరుణుడి కారణంగా రద్దయ్యింది. మళ్లీ రెండో సిరీస్ మంగళవారం జరగనుంది.

అయితే... గౌహతి వేదికగా ఆదివారం జరగాల్సిన మ్యాచ్ లో వర్షం భారీ ఎత్తున పడటంతో... పిచ్ మొత్తం పూర్తిగా తడిచిపోయింది. పిచ్ ని ఆర్పేందుకు అధికారులు నానా ప్రయత్నాలు చేశారు..కానీ తడి పోకపోవడంతో... మ్యాచ్ ని రద్దు చేశారు.

మూడు సార్లు అంపైర్లు పిచ్‌ను పరిశీలించిన తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాత్రి గం. 9.54 సమయంలో మ్యాచ్‌ రద్దయింది. అయితే... మ్యాచ్ రద్దయ్యింది అనే అధికార ప్రకటన రాకముందే క్రికెటర్లు స్టేడియం వదిలి వెళ్లిపోవడం గమనార్హం.

కొందరు క్రికెటర్లు ముందే స్టేడియం వదిలేసి వెళ్లిపోయారని అసోం క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.'చాలామంది ఆటగాళ్లు 9 గంటలకే స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అయితే అంపైర్లు రాత్రి గం.9.54కి మ్యాచ్‌ రద్దయినట్టు ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన అభిమానులు గొడవ చేయకుండా ఉండేందుకు అలా ప్రకటించి ఉండొచ్చని అనుకుంటున్నా' అని దేవజిత్‌ చెప్పారు.

AlsoRead ధావన్ దంచేనా..బుమ్రా మెరిసేనా...అభిమానుల కోరిక తీరేనా....?

‘ఆదివారం దాదాపు గంటపాటు వర్షం కురిసింది. గం.8.45లోపు మైదానం రెడీ చేయకుంటే మ్యాచ్ ను రద్దు చేయక తప్పదని అధికారులు ముందుగానే తేల్చి చెప్పారు. అయితే సిబ్బందికి అంపైర్లు 57 నిమిషాల సమయమే ఇచ్చారు. మరికొంత సమయం ఇచ్చి ఉంటే పిచ్ ని రెడీ చేసేవాళ్లం. రివర్స్ ఓస్మోసిస్ కారణంగా పిచ్ చిత్తడిగా మారింది.’ అని ఆయన పేర్కొన్నారు.

తొలి టీ20లో టాస్ వేసాక.. మ్యాచ్ ప్రారంభం సమయానికి 15 నిమిషాల ముందు వర్షం పడింది. దాదాపు గంట తర్వాత ఆగిపోయింది. వర్షం తగ్గడంతో అంపైర్లు, మ్యాచ్‌ రెఫరీ పిచ్‌, మైదానాన్ని 7.45కు ఒకసారి, 9.30కు పరిశీలించారు. చివరకు 9.54కి మరోసారి పరిశీలించి మ్యాచ్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.  ఈ సంగతి పక్కన పెడితే.. నేడు  రెండో మ్యాచ్ జరగనుంది. ఇండోర్ వేదికగా ఈ మ్యాచ్  జరగనుంది.