Asianet News TeluguAsianet News Telugu

ధావన్ దంచేనా..బుమ్రా మెరిసేనా...అభిమానుల కోరిక తీరేనా....?

చిరు జల్లులతో కూడిన వర్షం, చిల్లులతో కూడిన కవర్లు అన్నీ వెరసి ఆదివారం గౌహతిలో జరగాల్సిన తొలి టీ20 రద్దుకు కారణమయ్యాయి. అభిమానులతో పాటు ఇరు జట్ల ఆటగాళ్లూ నిరుత్సాహానికి గురయ్యారు. అసంతృప్తితో అస్సాం వీడిన భారత్‌ నేడు అచ్చొచ్చిన వేదిక ఇండోర్‌లో కొత్త ఏడాది పయనాన్ని మొదలు పెట్టనుంది.

India vs Srilanka,2nd T20I: can inexperienced srilanka go past Team India
Author
Indore, First Published Jan 7, 2020, 10:55 AM IST

కొత్త ఏడాదిలో తొలి సవాల్‌ రద్దు అయ్యింది. మైదాన సిబ్బంది నిర్లక్ష్యం సమరం జరుగకుండా చేసింది!. గౌహతి టీ20 రద్దుతో భారత్‌, శ్రీలంక నేడు ఇండోర్‌లో తలపడనున్నాయి. ఇండోర్‌లో ఎదురులేని గెలుపు రికార్డున్న టీమ్‌ ఇండియా భారీ విజయంపై కన్నేసింది. 

సీనియర్లను పక్కనపెట్టి యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చిన శ్రీలంక 2020ని కొత్తగా ఆరంభించేందుకు ఎదురు చూస్తోంది. బలమైన భారత్‌పై యువ లంక జట్టు బల పరీక్షకు సిద్ధమైంది. ఆసక్తిరేపుతోన్న భారత్‌, శ్రీలంక రెండో టీ20 సమరం నేటి సాయంత్రం ప్రారంభమవనుంది. 

చిరు జల్లులతో కూడిన వర్షం, చిల్లులతో కూడిన కవర్లు అన్నీ వెరసి ఆదివారం గౌహతిలో జరగాల్సిన తొలి టీ20 రద్దుకు కారణమయ్యాయి. అభిమానులతో పాటు ఇరు జట్ల ఆటగాళ్లూ నిరుత్సాహానికి గురయ్యారు. 

అసంతృప్తితో అస్సాం వీడిన భారత్‌ నేడు అచ్చొచ్చిన వేదిక ఇండోర్‌లో కొత్త ఏడాది పయనాన్ని మొదలు పెట్టనుంది. 12 ఏండ్లుగా భారత్‌పై ద్వైపాక్షిక సిరీస్‌ విజయానికి నోచుకోని శ్రీలంక ఇప్పుడా నిరీక్షణకు తెరదించాలని భావిస్తోంది. 

Also read: షోయబ్! పేర్లు చెప్పు: కనేరియా ఇష్యూపై పాక్ మాజీ క్రికెటర్ సవాల్

లసిత్‌ మలింగ సారథ్యంలోని యువ జట్టు భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలనే సంకల్పంతో కనిపిస్తోంది. నేడు ఇండోర్‌లోని హౌల్కర్‌ స్టేడియంలో రాత్రి 7 గంటలకు టీ20 సమరం ప్రారంభమవనుంది.

భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌కు పరీక్ష : 

భారత బ్యాటింగ్‌ లైనప్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మినహా అందరూ పరీక్ష ఎదుర్కొంటున్నారు. టీ20 వరల్డ్‌కప్‌ సమీపిస్తున్న తరుణంలో ప్రపంచ కప్ జట్టులో చోటు కోసం నిరూపించునే పనిలో ఉన్నారు. 

గాయం నుంచి కోలుకున్న సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఖచ్చితంగా రాణించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌తో రంజీలో నాణ్యమైన పేసర్లను ఎదుర్కొని సెంచరీ బాదిన ధావన్‌ ఇండోర్‌లోనూ మెరవాలని చూస్తున్నాడు. 

ఏడాదిగా టీ20ల్లో దుమ్మురేపుతున్న రాహుల్‌ గత ఇండోర్‌ మ్యాచ్‌లో 89 పరుగులు చేశాడు. అప్పుడు కూడా ప్రత్యర్థి శ్రీలంకనే. మరోసారి అదే ప్రత్యర్థి, అదే వేదిక కావటంతో రాహుల్‌ జోరు కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంది. 

Also read: కోచ్ పదవి నుండి పీకేయాలంటే 35 కోట్లు డిమాండ్ చేసిన లంక కోచ్ 

వన్డేల్లో మెరుస్తున్నా టీ20 పరిస్థితులకు తగినట్టుగా శ్రేయస్ అయ్యర్‌ బ్యాటింగ్‌ లేదు. టీ20ల్లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ, బెంచ్‌కు మాత్రమే పరిమితమైన మనీశ్‌ పాండే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. 

ఈ పరిస్థితుల్లో అయ్యర్‌ ధనాధన్‌ ఆడాల్సిన అవసరం ఉంది. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ ఇటీవల వెస్టిండీస్‌తో సిరీస్‌లో రాణించాడు. కానీ మ్యాచ్‌ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు అతడి నుంచి ఆశిస్తోన్న జట్టు మేనేజ్‌మెంట్‌కు, పంత్‌ నిరూపించుకోవాల్సినది చాలానే ఉంది. 

శ్రీలంక సిరీస్‌ను సద్వినియోగం చేసుకుంటే పంత్‌పై ఒత్తిడి ఒకింత తగ్గనుంది. శివం దూబె అరకొర ప్రదర్శనలతో ఎంతో కాలం జట్టులో మనలేడు. అంచనాలను అందుకునే పని ఇండోర్‌లోనైనా మొదలుపెడతాడేమో చూడాలి. 

బౌలింగ్‌ విభాగంలో బుమ్రా మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంది. గతంలో ఇక్కడ కుల్దీప్‌, చాహల్‌ కలిసి ఏడు వికెట్లు కూల్చారు. ఈ మ్యాచ్‌లో ఈ ఇద్దరిలో ఒక్కరే తుది జట్టులో ఉండనున్నారు. నవదీప్‌ సైని, షార్దుల్‌ ఠాకూర్‌లు బుమ్రాతో కలిసి పేస్‌ విభాగంలో ఉండనున్నారు. పవర్‌ ప్లేలో బంతులేయగల స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్‌ సుందర్‌ తుది జట్టులో ఉండే అవకాశాలు అధికం. 

శ్రీలంక బలమెంత?

టి 20ల్లో బలమైన పాకిస్థాన్‌ను 3-0తో ఓడించిన యువ లంక ఇప్పుడు బలమైన భారత్‌కు సవాల్‌ విసురుతోంది. భానుక రాజపక్సె, వానిందు హసరంగ, దశన్‌ శనక, ఇసురు ఉదాన, అవిష్క ఫెర్నాండోలపై శ్రీలంక భారీ అంచనాలు పెట్టుకుంది. 

వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ కుశల్‌ పెరీరా ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌లో మెరిసినా, స్థాయికి తగ్గ ప్రదర్శనలు చేయలేదు. భారత్‌పై మెరుగైన రికార్డున్న పెరీరా, సీనియర్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 

Also read: టీ20 మ్యాచ్ ఆగినా.. అద్భుతమైన సీన్ పండింది.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ

గుణతిలక, ఒషాడ ఫెర్నాండో, ధనంజయ డిసిల్వలు రాణిస్తే శ్రీలంక గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. సీనియర్‌ ఆటగాడు ఏంజిలో మాథ్యూస్‌ ఇండోర్‌లో ఆడేది లేనిది అనుమానమే. యార్కర్ల కింగ్‌ లసిత్‌ మలింగ తనలో పస తగ్గలేదని నిరూపించుకునే పనిలో ఉన్నాడు.

పిచ్‌, వెదర్ కండిషన్స్ : 

ఇండోర్‌ హోల్కర్‌ స్టేడియం భారత్‌కు కంచుకోట. ఇక్కడ ఆడిన ఏ మ్యాచ్‌లోనూ (టెస్టు, వన్డే, టీ20) టీమ్‌ ఇండియా ఓటమి చెందిన చరిత్ర లేదు. రెండు టెస్టులు, ఐదు వన్డేల్లో విజయకేతనం ఎగురవేసింది. 

ఏకైక టీ20లో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. 2017లో జరిగిన టీ20లో భారత్‌ 260 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ మ్యాచ్‌ లో శతకం బాదిన రోహిత్‌ నేటి మ్యాచులో  లేకపోయినా, విధ్వంసకారుడు కెఎల్‌ రాహుల్‌ బరిలోనే ఉన్నాడు. 

నేటి మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారనుంది. మణికట్టు మాంత్రికులు కుల్దీప్‌, చాహల్‌లు ప్రభావం చూపనున్నారు. మంచు (డ్యూ ఫాక్టర్) ప్రభావం దృష్ట్యా టాస్‌ నెగ్గిన జట్టు ఛేదనకు మొగ్గుచూపుతుంది.

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)... 

భారత్‌ : శిఖర్‌ ధావన్‌, కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, శివం దూబె, వాషింగ్టన్‌ సుందర్‌, షార్దుల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్‌ సైని.

శ్రీలంక : అవిష్క ఫెర్నాండో, ధనుష్క గుణతిలక, కుశాల్‌ పెరీరా, ఒషాడ ఫెర్నాండో, భానుక రాజపక్సె, ధనంజయ డిసిల్వ, దసున్‌ శనక, ఇసురు ఉదాన, వాహిందు హసరంగ, లహిరు కుమార, లసిత్‌ మలింగ.

Follow Us:
Download App:
  • android
  • ios