Yuvraj Singh Comeback: 2019 లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన 39 ఏండ్ల యువీ.. అన్నీ కుదిరితే వచ్చే నాలుగు నెలల్లో తనను ఫీల్డ్ లో చూస్తారని సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు చేశాడు.
టీమిండియా (Team India) మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తన ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పాడు. అభిమానుల కోరిక మేరకు త్వరలోనే మళ్లీ తనను మైదానంలో చూస్తారని హింట్ ఇచ్చాడు. 2019 లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ (Yuvraj Retirement) ప్రకటించిన 39 ఏండ్ల యువీ.. అన్నీ కుదిరితే వచ్చే నాలుగు నెలల్లో తనను ఫీల్డ్ లో చూస్తారని ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ (Yuvraj Instagram) ఖాతా వేదికగా యువీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
యువీ పోస్టు యథాతథంగా.. ‘భగవంతుడు నీ గమ్యాన్ని నిర్దేశిస్తాడు. ప్రజల కోరిక మేరకు నేను వచ్చే ఫిబ్రవరిలో నేను మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇంతకు మించిన గొప్ప ఫీలింగ్ మరోకటి ఉండదు.. మీ ప్రేమ, అభిమానాలకు సదా కృతజ్ఞుడిని. మన జట్టు (టీమిండియా)కు మీ మద్దతు ఇలాగే కొనసాగాలి. నిజమైన అభిమాని.. కఠిన సమయాల్లో కూడా మద్దతుగా నిలుస్తాడు..’ అంటూ రాసుకొచ్చాడు. అంతేగాక ఈ పోస్టుతో పాటు తన కెరీర్ లో చివరిసారిగా 2017లో సాధించిన సెంచరీ (ఇంగ్లాండ్ పై)కి సంబంధించిన వీడియోను కూడా జతపరిచాడు.
రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తాను నెలకొల్పిన క్రికెట్ అకాడమీ బాధ్యతలు చూసుకుంటున్న యువీ.. రెండేండ్ల తర్వాత మళ్లీ ఈ పోస్టు పెట్టడంతో క్రికెట్ ప్రేమికులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. అతడి ఆగమనానికి స్వాగతం చెబుతూ.. దుబాయ్ లో జరుగుతున్న ప్రపంచకప్ లోనే ఆడాల్సినందని కామెంట్స్ చేస్తున్నారు. భారత్ కు మాజీ కెప్టెన్ ధోని (MS Dhoni) అందించిన రెండు వరల్డ్ కప్ లలో యువరాజ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ టోర్నీ అవార్డు గెలుచుకోవడం విశేషం. 2007 టీ20 ప్రపంచకప్ తో పాటు.. 2011 వన్డే ప్రపంచకప్ లో కూడా మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డును గెలుచుకున్నాడు.
భారత్ (India) తరఫున 304 వన్డేలు ఆడిన యువీ.. 8701 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 150 పరుగులు. టెస్టులలో 40 మ్యాచ్ లు ఆడి.. 1900 పరుగులు చేశాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేసే యువీ.. తన వన్డే కెరీర్ లో 111 వికెట్లు కూడా తీశాడు. ఇక టీ20 (T20)లలో.. 58 మ్యాచ్ లు ఆడి 1,177 పరుగులు చేశాడు.
ఇదిలాఉండగా.. యువీ కమ్ బ్యాక్ పై నెటిజన్లు వినూత్న రీతిలో స్పందిస్తున్నారు. ‘నీ రాక కోసం ఎదురుచూస్తున్నాం. మళ్లీ ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు కొడితే చూడాలని ఉంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2011 ప్రపంచకప్ తర్వాత.. క్యాన్సర్ బారిన పడి విజయవంతంగా కోలుకున్న యువీ.. ఆ తర్వాత జట్టులోకి తిరిగొచ్చినా పెద్దగా రాణించలేదు. అయితే ఫిబ్రవరిలో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ జరుగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ టోర్నీ గురించే యువీ ఈ పోస్టు పెట్టి ఉంటాడని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు. మరి యువీ.. రోడ్ సేఫ్టీ సిరీస్ కోసమే ఈ పోస్టు పెట్టాడా..? లేదా నిజంగానే కమ్ బ్యాక్ ఇస్తాడా..? అంటే ఫిబ్రవరి దాకా వేచి చూడాల్సిందే.
