పాకిస్తాన్ తో క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని మాజీ బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సూచించారు. ఇకపై కూడా పాక్ తో భారత్ క్రికెట్ మ్యాచులు నిర్వహించకూడదని సూచించారు. 

పాకిస్తాన్‌తో అన్ని క్రికెట్ సంబంధాలు తెంచుకోవాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించారు. గత కొన్నేళ్లుగా భారత్, పాకిస్తాన్ ఐసిసి ఈవెంట్స్‌లో మాత్రమే తలపడుతున్నాయి... టీ20, 50 ఓవర్ల ప్రపంచ కప్‌లు, ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) నిర్వహించే ఆసియా కప్ ఈవెంట్స్‌లో మాత్రమే తలపడ్డాయి. ద్వైపాక్షిక మ్యాచులు జరగడం లేదు.... ఇదే విధానాన్ని కొనసాగించాలని గంగూలీ కోరారు. 

"100 శాతం ఇది (పాకిస్తాన్‌తో సంబంధాలు తెంచుకోవడం) చేయాలి. కఠిన చర్యలు అవసరం. ప్రతి సంవత్సరం ఇలాంటివి జరగడం చాలా తీవ్రమైన విషయం. ఉగ్రవాదాన్ని సహించకూడదు" అని గంగూలీ సూచించారు. 

2013 నుంచి భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిపివేత

రెండు దేశాల మధ్య ఉద్రిక్త రాజకీయ సంబంధాల కారణంగా 2008లో ఆసియా కప్‌లో పాల్గొన్నప్పటి నుంచి భారత్ పాకిస్తాన్‌ను పర్యటించలేదు. రెండు ప్రత్యర్థి దేశాలు చివరిసారిగా 2012-13లో భారత్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాయి, ఇందులో వైట్-బాల్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్‌కు వెళ్లలేదు. బదులుగా వారు తమ అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో హైబ్రిడ్ మోడల్ కింద ఆడారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఛైర్మన్ జై షా ఉన్నంతకాలం అంటే 2024-27 మధ్య భారత్, పకిస్తాన్‌లో జరిగే అన్ని ఐసిసి ఈవెంట్స్‌కు హైబ్రిడ్ మోడల్‌ను నిర్ణయించనున్నారు.

పహల్గాంలో జరిగిన దారుణ ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనేక దౌత్య చర్యలను ప్రకటించింది, అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ICP)ని మూసివేయడం, పాకిస్తానీ జాతీయులకు SAARC వీసా మినహాయింపు పథకాన్ని (SVES) నిలిపివేయడం, వారి దేశానికి తిరిగి వెళ్లడానికి 40 గంటల సమయం ఇవ్వడం, రెండు వైపులా ఉన్న హై కమిషన్లలో అధికారుల సంఖ్యను తగ్గించడం వంటివి చేసింది.