Asianet News TeluguAsianet News Telugu

Jhulan Goswami: చెక్డా టు లార్డ్స్.. జయహో జులన్.. ఆ ప్రయాణం ఆద్యంతం స్ఫూర్తివంతమే..

Jhulan Goswami Retirement: భారత మహిళా క్రికెట్‌లో ఓ శకం ముగసింది.  రెండు దశాబ్దాల పాటు భారత జట్టు బౌలింగ్ బాధ్యతలను మోసిన జులన్ గోస్వామి నేడు లార్డ్స్ వేదికగా  ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్ ఆమెకు  అంతర్జాతీయ స్థాయిలో చివరిది. 

From Chakdah To Lords, check Out The Inspirable Journey Of Team India's veteran Pacer Jhulan Goswami
Author
First Published Sep 24, 2022, 6:34 PM IST

సరిగ్గా 20 సంవత్సరాల  261 రోజులు.. భారత మహిళా క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగిన జులన్ గోస్వామి అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు సేవలందిస్తున్న కాలమది.  ఈ దిగ్గజం నేడు లార్డ్స్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో వన్డే తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నది. సుదీర్ఘ కెరీర్ లో ఆమె సాధించిన ఘనతలు తక్కువేమీ కాదు.  జనవరి 6 2002 నుంచి.. నేటి వరకు ఆటలోనే  20 ఏండ్లు పూర్తి చేసుకున్న  ఈ దిగ్గజ బౌలర్ ప్రయాణం గురించి ఇక్కడ చూద్దాం. 

పశ్చిమబెంగాల్ లోని నదియా జిల్లా చక్డా జులన్ సొంతఊరు. భౌగోళికంగా ఆ ఊరు లోతట్టు ప్రాంతం. చక్డా నుంచి కోల్కతాకు 80 కిలోమీటర్ల దూరం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన జులన్‌కు బెంగాల్ లో అందరి మాదిరే ఫుట్‌బాల్ అంటే ఇష్టం. కానీ టీవీలలో వచ్చే క్రికెట్ మ్యాచ్‌లను చూసి ఆమె దృష్టి బంతి మీద పడింది. 

పసి వయసులోనే ఆట ఆరంభం.. 

చిన్నప్పట్నుంచే క్రికెట్ మీద మక్కువ పెంచుకున్న జులన్.. పన్నెండేండ్ల వయసు నుంచే క్రికెట్ ను తన అణువణువునా నింపుకుంది.  చిన్నప్పుడు స్కూల్ లో, ఊళ్లో  అబ్బాయిలతోనే క్రికెట్ ఆడేది. అప్పటికీ అమ్మాయిల క్రికెట్ కు ఇప్పుడున్నంత ఆదరణ కూడా లేదు. ‘ఆడపిల్లలకు ఆటలెందుకు.. అది కూడా క్రికెట్. అవసరమా..?’ అనే ఎన్నో ఎత్తిపొడుపులను  విన్న జులన్ తన లక్ష్యాన్ని మాత్రం  పక్కకు పోనియలేదు. 

అక్కడే మలుపు.. 

అంతర్జాతీయ క్రికెట్ ఆడాలన్న ఆమె కోరిక బలంగా నాటుకుపోయింది 1997లో.  ఆ ఏడాది కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్ లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య వన్డే వరల్డ్ కప్ ఫైనల్. ఆ మ్యాచ్ కు జులన్ బాల్ గర్ల్ (ఫీల్డర్లకు బాల్ అందివ్వడం) గా పనిచేసింది. ఆ మ్యాచ్ చూసిన జులన్.. ‘భారత్ తరఫున కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాలి. ఒక్క వికెట్ అయినా తీయాలి..’ అని మనసులో నిశ్చయించుకుంది.  ఇక పొద్దస్తమానం అదే ఆలోచన. ఆ దిశగా  కృషి చేసింది. అప్పుడు ఆమె వయసు 15 ఏండ్లు. 

ప్రాక్టీస్ కోసం రోజు 160 కిలోమీటర్ల ప్రయాణం.. 

ఇక తన లైఫ్ లో క్రికెట్ తప్ప ఏమీ లేదని నిశ్చయించుకున్న జులన్.. ఆ దిశగా ముందడుగు వేయాలనుకుంది. కానీ అప్పటికీ చక్డాలో గానీ నదియాలో గానీ క్రికెట్ అకాడమీలు లేవు.  క్రికెట్ కోచింగ్ తీసుకోవాలంటే కోల్కతా వెళ్లాల్సిందే.  అందుకోసం రోజూ ఉదయం 5 గంటలకు చక్డాలో ట్రైన్ ఎక్కి సీల్దాలో ప్రాక్టీస్ కోసం వచ్చేది. ఉదయం, సాయంత్రం రోజుకు 160 కిలోమీటర్లు (అప్ అండ్ డౌన్) ప్రయాణం చేసేది. 

 

ఆ తరుణం రానే వచ్చింది.. 

‘భారత్ కు ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని’ జులన్ ఎంత గట్టిగా సంకల్పించుకుందో తెలియదు గానీ ఐదేండ్ల (1997 ప్రపంచకప్) తర్వాత జులన్ భారత జట్టులో చోటు దక్కించుకుంది.  19 ఏండ్ల వయసులో ఆమె.. తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. అప్పటికింకా బీసీసీఐ మహిళా విభాగం లేదు. అప్పుడు భారత మహిళల జట్టు ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ (డబ్ల్యూసీఎఐ) కింద ఆడారు. జులన్.. 2002 జనవరి 14న చెన్నైలో ఇంగ్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడింది.   

జెర్సీలు కూడా లేని స్థితి నుంచి.. 

అప్పట్లో భారత పురుషుల క్రికెట్ కు ఉన్న ఆదరణ మహిళా క్రికెట్ కు లేదు. ఏదో ఒక జట్టు ఉందా..? అంటే ఉన్నదన్నట్టుగానే ఉమెన్ క్రికెట్ టీమ్ ఉండేది. బీసీసీఐ కూడా మహిళా క్రికెట్ మీద అంత ఆసక్తి చూపలేదు. దీంతో పురుష క్రికెటర్లు అనుభవించిన లగ్జరీలు మహిళా క్రికెటర్లకు దక్కలేదు. భారత్ లో మ్యాచ్ లు ఆడేందుకు జులన్.. సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్స్ లలో ప్రయాణించేది. డార్మెటరీలలో  అతి సాధారణ  వాష్ రూమ్ లు ఉన్నచోట కూడా సర్దుబాటు అయింది. కనీసం మ్యాచ్ లలో అమ్మాయిలకు ప్రత్యేక జెర్సీలు కూడా లేని రోజులనూ చూసింది జులన్. పురుష క్రికెటర్ల జెర్సీలకే వెనుకాల స్టిక్కర్ మార్చి ఉమెన్ టీమ్స్ కు పంపించేవాళ్లు. కానీ తనకు ఎంతో ఇష్టమైన ఆట ముందు ఆమెకు ఈ కష్టాలన్నీ  చిన్నవిగా అనిపించాయి.  

లెక్కకు మించిన రికార్డులు.. 

భారత జట్టు తరఫున ఆడుతూ ఒక్క వికెట్ తీసినా చాలు అని కలలు కన్న  జులన్ గోస్వామి.. తన కెరీర్ లో ఇన్ని ఘనతలు సాధిస్తుందని కలలో కూడా ఊహించి ఉండదు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన (ఇప్పటివరకైతే) రికార్డు ఆమెదే.  తన సుదీర్ఘ కెరీర్ లో మొత్తం 353 వికెట్లు పడగొట్టింది. ప్రపంచ క్రికెట్ (మహిళల) లో మరే బౌలర్ ఇన్ని వికెట్లు తీయలేదు.  ముఖ్యంగా వన్డేలలో ఆమె రికార్డులు చేరుకునే బౌలర్ అయితే దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు.  జులన్ తన కెరీర్ లో 12 టెస్టులలో 44 వికెట్లు, 203 వన్డేలలో 253 వికెట్లు, 68 టీ20లలో 56 వికెట్లు తీసింది. జులన్ సాధించిన రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. 

 

- వన్డేలలో 200, 250 వికెట్లు తీసుకున్న తొలి మహిళా బౌలర్. 
- జులన్ బౌలరే కాదు.. మంచి బ్యాటర్ కూడా. వన్డేలలో ఆమె 1,228 పరుగులు చేసింది. వన్డే ఫార్మాట్ లో వెయ్యికి పైగా పరుగులు,  వంద వికెట్లు సాధించిన భారత క్రికెటర్. 
- మహిళల ప్రపంచకప్ (34 మ్యాచ్ లు) లో అత్యధిక వికెట్లు : 43 
- ఉమెన్స్ క్రికెట్ లో మిథాలీ రాజ్ (22 ఏండ్ల 274 రోజులు) తర్వాత అత్యధిక కెరీర్ కలిగిన (20 ఏండ్ల 260 రోజులు)  రెండో క్రికెటర్. 
- అత్యధిక క్యాచ్ లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానం. తన కెరీర్ లో ఆమె 68 క్యాచ్ లు అందుకుంది.  న్యూజిలాండ్ కు చెందిన సూజీ బేట్స్ 78 క్యాచ్ లు పట్టింది. 
- 2006 లో ఇంగ్లాండ్ లో ఆడుతూ  ఒక టెస్టులో పది వికెట్ల (78-10)  ప్రదర్శన చేసిన ఏకైక భారత బౌలర్. 

Follow Us:
Download App:
  • android
  • ios