French Open 2023:  టెన్నిస్ దిగ్గజం  నొవాక్ జకోవిచ్  చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగుదూరంలో ఉన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ లో అతడు  ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 

మట్టికోర్టు మహారాజు రఫెల్ నాదల్ లేని ఫ్రెంచ్ ఓపెన్‌లో సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జకోవిచ్ జోరు కొనసాగుతోంది. సెమీస్‌లో జకోవిచ్.. మెన్స్ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ ను ఓడించాడు. శుక్రవారం పారిస్ వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్ లో మూడో సీడ్ జకోవిచ్.. 6-3, 5-7, 6-1, 6-1 తేడాతో స్పెయిన్ యువ సంచలనం అల్కరాజ్ పై విజయం సాధించాడు. హోరాహోరిగా సాగిన ఈ పోరులో అల్కరాజ్ చివరివరకూ పోరాడినా జకోవిచ్ అనుభవం ముందు అతడు నిలువలేకపోయాడు. 

పారిస్ వేదికగా ముగిసిన నిన్నటి పోరులో జకోవిచ్ తొలి సెట్ గెలుచుకున్నాడు. కానీ అల్కరాజ్ పుంజుకుని రెండో సెట్ సొంతం చేసుకున్నాడు. రెండు సెట్లు పూర్తవడానికే సుమారు రెండు గంటలన్నర సమయం పట్టింది. దీంతో తర్వాత ఆట మరింత రసవత్తరంగా సాగుతుందనుకున్న తరుణంలో అల్కరాజ్ కు ఉన్నట్టుండి తొడ కండరాలు పట్టేయడంతో అతడి జోరు తగ్గింది.

వైద్య సాయం తీసుకున్నా అల్కరాజ్ కోర్టులో ఇబ్బందిపడ్డాడు. చివరివరకూ గెలిచేందుకు ప్రయత్నించినా గాయం కారణంగా అది సాధ్యపడలేదు. గేమ్ ముగిసిన తర్వాత జకోవిచ్.. అల్కరాజ్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడింకా యువకుడే అని రాబోయే రోజుల్లో ఫ్రెంచ్ ఓపెన్ లో నాదల్ వలే ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Scroll to load tweet…

చరిత్రకు అడుగుదూరంలో.. 

మరో సెమీస్ లో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్ 6-3, 6-4, 6-0 తేడాతో జర్మనీకి చెందిన జ్వెరెవ్ ను ఓడించాడు. మెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో భాగంగా జకోవిచ్ - రూడ్ ల మధ్య ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ ఆదివారం (జులై 11) జరుగుతుంది. కాగా జకోకు ఇది 34వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఆదివారం జరుగబోయే మ్యాచ్ లో కూడా గెలిస్తే జకోవిచ్.. పురుషుల ఓపెన్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం జకో.. 22 గ్రాండ్ స్లామ్స్ తో నాదల్ తో సమానంగా ఉన్నాడు. 

మహిళల ఫైనల్స్‌లో.. 

మహిళల సింగిల్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలండ్).. ఫైనల్ లో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాతో పోటీ పడనుంది. సెమీస్ లో ముచోవా రెండో సీడ్ సబలెంకాపై గెలిచింది. 2020 తో పాటు 2022 లో కూడా స్వియాటెక్.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గింది. స్వియాటెక్ నిరుడు యూఎస్ ఓపెన్ లో కూడా విజేతగా నిలిచింది. 

Scroll to load tweet…