Asianet News TeluguAsianet News Telugu

రవిశాస్త్రి, ద్రావిడ్ మధ్య ప్రధాన తేడా అదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీమిండియా వరల్డ్ కప్ హీరో

Gautam Gambhir: టీమిండియాకు కోచ్ గా పనిచేసిన రవిశాస్త్రి, ప్రస్తుతం కోచ్ గా పనిచేస్తున్న రాహుల్ ద్రావిడ్ ల మధ్య ప్రధాన తేడా గురించి భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

Former Team India player Gautam Gambhir points out one major difference between Rahul Dravid and Ravi Shastri
Author
Hyderabad, First Published Nov 22, 2021, 2:44 PM IST

భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ కు చుక్కలు చూపెడుతూ.. రోహిత్ సేన టీ20  సిరీస్ ను ఘనంగా ముగించింది. మూడు మ్యాచులలో నెగ్గి 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. తమ తొలి సిరీస్ లోనే కొత్త  కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కోచ్  రాహుల్ ద్రావిడ్ లకు తమ లక్ష్యం దిశగా ప్రయాణిస్తున్నట్టు కనిపించారు. అయితే మ్యాచ్ అనంతరం రాహుల్ ద్రావిడ్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీటిపై టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ స్పందించాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ద్రావిడ్ స్వభావమని గంభీర్ కొనియాడాడు. అంతేగాక రాహుల్ ద్రావిడ్.. ఇటీవలే ఆ పదవి నుంచి వైదొలిగిన రవిశాస్త్రి ల మధ్య ఉన్న ప్రధాన తేడా గురించి కూడా గంభీర్ వివరించాడు. 

గంభీర్ మాట్లాడుతూ..  ‘మీరు ఆస్ట్రేలియా (రవిశాస్త్రి కోచ్ గా ఉన్నప్పుడు టీమిండియా) లో గెలిచారు. అది పెద్ద విజయమే..  అందులో సందేహం లేదు. ఇంగ్లాండ్ లో కూడా మీరు భాగా ఆడారు. కానీ ఇతరులు  ఆ విజయాల గురించి మాట్లాడనివ్వండి..’ అంటూ పరోక్షంగా రవిశాస్త్రికి కౌంటర్ ఇచ్చాడు. 

2018-19లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. అప్పుడు  టీమిండియా ఆసీస్ ను  వాళ్ల గడ్డపైనే మట్టికరిపించి సిరీస్ ను  సొంతం చేసుకుంది. దీనిపై శాస్త్రి పలు సందర్భాలలో మాట్లాడుతూ.. ఇది 1983 ప్రపంచకప్ విజయం కన్నా పెద్ద విజయమని వ్యాఖ్యానించాడు. అంతేగాక ఇతర దేశాల్లో పలు సిరీస్ లు, టోర్నీలు గెలిచినప్పుడు కూడా రవిశాస్త్రి ఇటువంటి స్టేట్మెంట్లే ఇచ్చాడు. గంభీర్ దీనినే ఎత్తిచూపుతూ పై వ్యాఖ్యలు చేశాడు. 

అంతేగాక ఇంకా  గంభీర్ మాట్లాడుతూ..‘ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మీరు మంచి ప్రదర్శనలు  చేసి విజయాలు సాధించినప్పుడు దాని గురించి మీరు గొప్పలు చెప్పుకోకూడదు. ఒకవేళ అవతలి వాళ్లు మన విజయాల గురించి మాట్లాడుకుంటే ఓకే. మేము 2011 ప్రపంచకప్ గెలిచినప్పుడు.. ప్రపంచక్రికెట్లో మేమే అత్యుత్తమ జట్టని మేమెప్పుడూ స్టేట్మెంట్లు ఇవ్వలేదు.. మనం విజయం సాధించినప్పుడు ఇతరులు దాని గురించి మాట్లాడాలి. రాహుల్ ద్రావిడ్ అలాంటి ప్రకటనలు ఎప్పుడూ చేయలేదు. ఒకవేళ జట్టు ఓడినా గెలిచినా అతడి ప్రకటనలు ఎప్పుడూ సమతుల్యంగా ఉంటాయి. అది జట్టులోని ఇతర ఆటగాళ్ల మీద కూడా ప్రభావం చూపుతుంది’ అని అన్నాడు. 

‘ఫలితాలతో సంబంధం లేకుండా వినయంగా ఉండటం చాలా ముఖ్యం. ద్రావిడ్ లో అది ప్రస్పుటంగా కనిపిస్తుంది. అతడి ప్రధాన దృష్టంతా ఆటగాళ్లను మంచి మనుషులుగా తయారుచేయడం మీదే ఉంటుంది..’అని గంభీర్ తెలిపాడు. 

 

కాగా.. నిన్నటి మ్యాచ్ అనంతరం ద్రావిడ్ మాట్లాడుతూ.. ‘నిజంగా ఈ సిరీస్ విజయంపై ఎంతో సంతోషంగా ఉన్నా. సిరీస్ ఆసాంతం అందరూ బాగా ఆడారు. అయితే, వాస్తవ పరిస్థితుల గురించి కూడా మనం ఒకసారి ఆలోచించాలి. మన కాళ్లు నేలమీద ఉండాలి. ప్రపంచకప్ ముగిసిన వెంటనే కివీస్ ఇక్కడికొచ్చి ఆరు రోజుల్లో మూడు మ్యాచులాడింది. అది ఆ జట్టుకు అంత తేలికేమీ కాదు. మన కాళ్లు నేలమీదే ఉండాలి..’ అని తెలిపాడు.

Follow Us:
Download App:
  • android
  • ios