కోవిడ్ బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ ఆరోగ్య పరిస్ధితి విషమంగా మారింది. వైరస్ కారణంగా ఆయన శరీరంలోని అవయవాలు వైఫల్యం చెందినట్లుగా డాక్టర్లు చెబుతున్నారు.

కోవిడ్ లక్షణాలు బయటపడటంతో జూలై 12న ఆయను లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

టీమిండియా 1969లో ఎంట్రీ ఇచ్చిన చేతన్ చౌహాన్ 40 టెస్టులాడి 2,084 పరుగులు చేశాడు. అలానే ఆడిన 7 వన్డేల్లో 153 పరుగులు చేశాడు. 1981లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన చౌహాన్.. కెరీర్‌లో కనీసం ఒక్క సెంచరీని కూడా నమోదు చేయలేకపోయాడు.

ఓపెనర్‌గా చేతన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. సునీల్ గావస్కర్‌తో కలిసి ఓపెనింగ్‌కు దిగిన ఆయన 40 టెస్టుల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. వీరిద్దరూ కలిసి సుమారు 3,000 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 1981లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత చేతన్ చౌహాన్ రాజకీయాల్లోనూ రాణించారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ మంత్రిగా సేవలందిస్తున్నారు.

చేతన్ కిడ్నిలు పాడయ్యాయని.. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపారు. కిడ్నీతో  పాటు రక్తపోటు సమస్యలు కూడా ఆయన ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.