David Warner Imitates Allu Arjun: వార్నర్.. అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేయడం ఇదేం కొత్త కాదు. గతంలో బన్నీ నటించిన అల వైకుంఠపురంలోని బుట్టబొమ్మ పాటకు కూడా తన భార్య క్యాండీ, పిల్లలతో కలిసి స్టెప్పులేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మిగతా జట్ల సంగతేమో గానీ సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ ది, ఆరెంజ్ ఆర్మీ అభిమానులది మాత్రం ప్రత్యేకమైన అనుబంధం. వార్నర్ ను వాళ్లు ఎప్పుడూ ఒక విదేశీయుడిగా చూడలేదు. సొంత అన్నలా ఆదరించారు. అతడి భార్య, పిల్లలను కూడా తమ కుటుంబసభ్యుల మాదిరే భావించారు. వారి కల్మషం లేని ప్రేమను పొందిన వార్నర్ కూడా.. అభిమానులను సొంతవారికంటే ఎక్కువగా చూసుకున్నాడు. ఇక సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉండే వార్నర్ తాజాగా పుష్ప సినిమాలోని ‘యే బిడ్దా.. ఇది నా అడ్డా..’ పాటను ఇమిటేట్ చేస్తూ ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. 

ఫేస్ యాప్ ద్వారా గతంలో పలు హిట్ సినిమాల ప్రోమోలకు తన ఫేస్ ను అటాచ్ చేసిన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్టులు పెట్టిన వార్నర్ తాజాగా బన్నీ నటించిన పుష్ప సినిమాలోని ‘యే బిడ్డా’ పాటను కూడా ఇమిటేట్ చేశాడు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘క్యాప్షన్ దిస్...’ అంటూ కామెంట్ పెట్టాడు. 

View post on Instagram

ఈ వీడియో ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నది. పుష్పరాజ్ గెటప్ లో ఉన్న వార్నర్ భాయ్ ను చూసిన అభిమానులు... ‘కోకో కోలా పెప్సీ.. డేవిడ్ భాయ్ సెక్సీ..’, ‘వార్నర్ అంటే ఫైర్.. ఫ్లవర్ అనుకుంటివా..’‘నీ అవ్వ తగ్గేదేలే..’ ‘డేవిడ్ పుష్ప..’ ‘వార్నర్ భాయ్.. మీరు త్వరగా రిటైర్ అయి ఇండియన్ సినిమాలో యాక్ట్ చేయడానికి రండి..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

ప్రేక్షకులే కాదండోయ్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ‘నువ్వు ఓకేనా..?’అని కామెంట్ పెట్టాడు. దీనికి వార్నర్ స్పందిస్తూ.. ‘కొంత గొంతు పట్టేసినట్టుంది..’ అని రాసుకొచ్చాడు. 

ఇక వార్నర్.. అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేయడం ఇదేం కొత్త కాదు. గతంలో బన్నీ నటించిన అల వైకుంఠపురంలోని బుట్టబొమ్మ పాటకు కూడా వార్నర్... తన భార్య క్యాండీ, పిల్లలతో కలిసి స్టెప్పులేశాడు. వార్నర్ స్టెప్పులతో ఆ పాట మరింత పాపులర్ అయిందని గతంలో బన్నీ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.

YouTube video player

ఏదేమైనా ఈసారి ఐపీఎల్ లో వార్నర్ భాయ్ మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడటం లేదు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యంతో విభేదాల కారనంగా ఐపీఎల్-2021 లో అతడిని కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి కూడా తప్పించిన సన్ రైజర్స్ యాజమాన్యం.. ఇటీవలే ముగిసిన రిటెన్షన్ పాలసీలో కూడా తన పేరు చేర్చలేదు. దీంతో కొద్దిరోజుల్లో మొదలుకాబోయే ఐపీఎల్ మెగా వేలంలో అతడు పాల్గొనే అవకాశాలున్నాయి.ప్రస్తుతం యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్న వార్నర్.. శనివారం గబ్బాలో ముగిసిన తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 94 పరుగులు చేశాడు. మూడు సార్లు లైఫ్ లు వచ్చినా ఆరు పరుగుల దూరంలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.