ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో విదేశీయులతోపాటుగా భారత కోచ్‌లకు కూడా అవకాశాలు ఇవ్వాలని భారత జట్టు మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్ అన్నాడు. సహాయక సిబ్బందిలో విదేశీయులను కాకుండా, భారతీయులకు అవకాశం కల్పించటం మేలు చేస్తుందని అభిప్రాయపడ్డాడు.

'ఐపీఎల్‌ ప్రాంఛైజీలు కోచ్‌లుగా మంచి అనుభవం ఉన్న భారత మాజీ క్రికెటర్లకు అవకాశాలు కల్పించాలి. ఇది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌. భారత కోచ్‌లకు కచ్చితంగా ఎక్కువ అవకాశాలు లభించాలి. 

బిగ్‌బాష్‌ లీగ్‌ లేదా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్లకు కోచింగ్‌ ఇచ్చే అవకాశం మన కోచ్‌లకు లభించదు. ఎవరిని ఎంచుకోవాలనే నిర్ణయం ప్రాంఛైజీల యాజమానులది. విలువైన అంతర్జాతీయ క్రికెట్‌ అనుభవం గడించిన భారత క్రికెటర్లు ఉన్నారనే విషయం మరిచిపోకూడదు. 

వారికీ ఓ అవకాశం దక్కటం న్యాయం. ఐపీఎల్‌ నుంచి ప్రోత్సాహం, ఆర్థిక సహకారం మన క్రికెటర్లకు దక్కాలి. మాజీ క్రికెటర్లకు బీసీసీఐ ఆర్థిక ప్రయోజనాలు దక్కుతున్నాయనే విషయాన్ని అంగీకరిస్తున్నాను. కానీ ఎంతో మంది విదేశీ క్రికెటర్లు ఐపీఎల్‌లో కోచింగ్‌ ద్వారా కోట్లు గడిస్తుంటే.. అవే మన క్రికెటర్లు ఎందుకు పొందకూడదు? ఇదే విషయాన్ని నిరుడు బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశంలో లేవనెత్తాను' అని అజారుద్దీన్‌ తెలిపాడు.

ఇకపోతే... మార్చి 29 నుంచి మే 24 వరకు జరగాల్సిన ఐపీఎల్‌ షెడ్యూల్‌ కరోనా వైరస్‌ మహమ్మారి కారణంతో నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 19న తొలి మ్యాచ్‌, నవంబర్‌ 8 ఫైనల్‌తో నూతన షెడ్యూల్‌ బీసీసీఐ రూపొందించిందన్న విషయం విదితమే. 

 ఐపీఎల్‌ 13 సీజన్‌ మార్చి 29-మే 24న జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా తొలుత ఏప్రిల్‌ 15కు, తర్వాత నిరవధిక వాయిదా పడింది. అప్పట్నుంచి ఐసీసీ, ఏసీసీ టోర్నీలు వాయిదా పడేందుకు బీసీసీఐ ఎదురుచూసింది. దీంతో ఐపీఎల్‌ నిర్వహణకు 8 వారాల సమయం లభించింది. 

యుఏఈలో మూడు స్టేడియాల్లో ఐపీఎల్‌ జరిగే అవకాశం కనిపిస్తోంది. షేక్‌ జయేద్‌ క్రికెట్‌ స్టేడియం, అబుదాబి, దుబాయి, షార్జాలు ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మూడు స్టేడియాలను అద్దెకు తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఐసీసీ అకాడమీకి సైతం బోర్డు అద్దెకు తీసుకునే యోచనలో ఉంది. యుఏఈ ప్రభుత్వం అనుమతిస్తే, అభిమానులను సైతం పరిమిత సంఖ్యలో అనుమతించే అవకాశం లేకపోలేదు.