పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ద్వంద్వ విధానాలపై ఆ దేశ మాజీ క్రికెటర్‌ డానీష్‌ కనేరియా ట్వీట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇంగ్లీష్‌ కౌంటీ క్రికెట్‌లో ఆడుతూ కనేరియా మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. దీంతో అతడిపై జీవిత కాల నిషేధం కొనసాగుతున్నా విషయం తెలిసిందే. 

పాకిస్థాన్‌ జాతీయ జట్టు తరఫున ఆడుతూ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన మహ్మద్‌ ఆమర్‌, మహ్మద్‌ అసిఫ్‌, సల్మాన్‌ భట్‌, నసీర్‌ జెంషెడ్‌లు భారీ శిక్ష నుంచి తప్పించుకున్నారు. కొందరు మళ్లీ పాకిస్థాన్‌ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నారు. తాజాగా ఉమర్‌ అక్మల్‌ శిక్షా కాలం సైతం 18 నెలలకు కుదించారు. 

దీంతో జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్న కనేరియా పీసీబీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్షమార్హం లేని విధానం నా విషయంలో మాత్రమే ఎందుకు అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. 

'జీరో టాలరెన్స్‌ విధానం కేవలం డానిష్‌ కనేరియాకు మాత్రమే వర్తిస్తుంది, ఇతరులకు వర్తించటం లేదు. ఇతరులకు కాకుండా నాకే ఎందుకు జీవిత కాల నిషేధం పడిందో ఎవరైనా చెప్పగలరా? విధానాలు కులం, రంగు, బలమైన సామాజిక నేపథ్యంలపై ఆధారపడి ఉంటాయా? నేను హిందువును, అందుకు గర్వపడుతున్నాను' అని కనేరియా ట్వీట్‌ చేశారు. 

కనేరియా దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టేంందుకు ముందు ఈసీబీ, ఆ తర్వాతే పీసీబీ అనుమతులు తీసుకోవాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు సూచించింది.